Vitamin D | మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. సాధారణంగా సూర్యరశ్మికి గురికావడం వల్ల మన శరీరంలో విటమిన్ డి సహజంగానే తయారవుతుంది. అలాగే విటమిన్ డి కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా, విటమిన్ డి సప్లిమెంట్స్ ద్వారా కూడా మనం విటమిన్ డి ని పొందవచ్చు. ఇతర విటమిన్ల లాగా మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మన శరీరానికి విటమిన్ డి ఎందుకు ముఖ్యమైనది, అలాగే విటమిన్ డి పరీక్షలు ఎంత తరచుగా చేయించుకోవాలి.. అన్న వివరాలను పోషకాహార వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మన శరీరంలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది. క్యాల్షియం, భాస్వరం శోషణను నియంత్రించడంలో విటమిన్ డి ఎంతో అవసరం. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా విటమిన్ డి అవసరమవుతుంది. ఆరోగ్యకరమైన ఎముకలకు విటమిన్ డి చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియాన్ని శరీరం ఉపయోగించుకోవడంలో విటమిన్ డి పాత్ర ఎంతో ఉంది. శరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును ప్రోత్సహించడంలో కూడా విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల మనం తరచూ ఇన్పెక్షన్ ల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా విటమిన్ డి కీలకంగా పని చేస్తుంది.
విటమిన్ డి లోపం వల్ల నిరాశ వంటి మానసిక స్థితి నెలకొంటుంది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉంటారు. కనుక శరీరంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల ఎముకల నొప్పి, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మందిలో ఈ లక్షణాలు కనిపించినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అలాగే టైప్ 1, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, ఇన్సులిన్ రెసిస్టెంట్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా అధిక శరీర బరువు ఉన్న వారిలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటాయి. కనుక అధిక బరువు ఉన్నవారు విటమిన్ డి ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు విటమిన్ డి సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విధంగా విటమిన్ డి మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుందని కనుక మన శరీరంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక ఈ విటమిన్ డి ఎక్కువగా జంతు సంబంధిత ఆహారాల్లో ఉంటుంది. చేపలు, చేప నూనె, గుడ్డు, పాలు, రెడ్ మీట్, కాలేయం వంటి ఆహారాల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. కనుక శాకాహారులు క్రమం తప్పకుండా విటమిన్ డి స్థాయిలను పరీక్షించుకోవడం చాలా అవసరం. రక్తపరీక్ష ద్వారా మనం మన శరీరంలో ఉండే విటమిన్ డి స్థాయిలను తెలుసుకోవచ్చు. మన శరీరంలో సుమారుగా 20ఎన్జి/ ఎమ్ఎల్ నుండి 50ఎన్జి/ ఎమ్ఎల్ వరకు విటమిన్ డి స్థాయిలు ఉండవచ్చు. ఇక 12ఎన్జి/ ఎమ్ఎల్ కంటే తక్కువగా ఉంటే శరీరంలో విటమిన్ డి లోపం ఉందని భావించాలి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. కనుక శరీరంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా విటమిన్ డి కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి విటమిన్ డి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని వైద్యులు తెలియజేస్తున్నారు.