Honey And Amla Mixture | శీతాకాలంలో ఉసిరికాయలు అధికంగా లభిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే చాలా మంది ఆ సీజన్లో ఉసిరికాయలను కొని వివిధ రకాలుగా నిల్వ చేస్తుంటారు. కొందరు పచ్చడి పెడితే, కొందరు ఉసిరి మురబ్బా వంటివి చేసి నిల్వ చేస్తారు. ఇంకా కొందరు ఉసిరికాయలను తేనెలో నానబెట్టి నిల్వ చేస్తారు. ఇలాంటి ఉసిరికాయలు మనకు బయట మార్కెట్లోనూ లభిస్తాయి. అయితే ఉసిరికాయలను నేరుగా తినడం కన్నా ఇలా తేనెలో నానబెట్టి తింటే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను తింటే అనేక పోషకాలు లభిస్తాయి. పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
తేనె, ఉసిరికాయ మిశ్రమంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది తెల్ల రక్త కణాలను తయారు అయ్యేలా చేస్తుంది. దీంతో శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఈ మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ మిశ్రమాన్ని తింటే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. వాతావరణం మారినప్పుడు ఈ సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఈ మిశ్రమంలో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. దీని వల్ల ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని తింటే కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ మిశ్రమం ఎంతగానో మేలు చేస్తుంది.
తేనె, ఉసిరి మిశ్రమాన్ని తింటుంటే విటమిన్ సి సమృద్ధిగా లభించి శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా మారుతుంది. అలాగే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గిపోతుంది. తలలో ఉండే ఇన్ఫెక్షన్తోపాటు చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తింటుంటే బరువును తగ్గించుకోవచ్చు. ఇది చాలా తక్కువ క్యాలరీలు ఉండే మిశ్రమం. దీన్ని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఉదయం తింటే రోజంతా శరీరం శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్గా పనిచేస్తారు. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమం మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.