Mulethi | ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు మూలికల గురించి అధిక శాతం మందికి ఇంకా తెలియదు. కొన్ని మూలికలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిని వాడితే అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. ఇక అలాంటి మూలికల్లో అతి మధురం కూడా ఒకటి. దీన్నే ములేథీ అని కూడా అంటారు. అతి మధురం మనకు మార్కెట్లలో వేర్ల రూపంలో లభిస్తుంది. అలాగే దీని చూర్ణాన్ని కూడా విక్రయిస్తుంటారు. అతి మధురం చూర్ణాన్ని పలు వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగించవచ్చు. ఇందులో గొప్ప ఆయుర్వేద గుణాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అతి మధురం ప్రతి ఇంట్లోనూ ఉండదగిన ఆయుర్వేద మూలిక.
అతి మధురం చూర్ణంతో టీ తయారు చేసుకుని తాగవచ్చు. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ అతి మధురం చూర్ణాన్ని వేసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా అతి మధురం చూర్ణాన్ని తయారు చేసి తాగుతుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఈ టీని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగవచ్చు. ఈ టీని సేవించడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు ఉండవు.
అతి మధురం వేరును వేడి నీటిలో వేసి అందులో నుంచి వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుండాలి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. శ్వాస నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా ఆడుతుంది. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్తి సమస్య ఉన్నవారు అతి మధురం టీని రోజూ 2 పూటలా భోజనం చేసిన అనంతరం 30 నిమిషాలు ఆగి సేవిస్తుండాలి. ఇలా తాగుతుంటే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఏర్పడదు. అతి మధురం చూర్ణాన్ని చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు.
అతి మధురం చూర్ణంలో కాస్త కొబ్బరినూనె లేదా బాదంనూనె కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంలో కాంతి పెరుగుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. ముఖం ప్రకాశిస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. అతి మధురం చూర్ణంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. కణాలు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. దీంతో చర్మం ఎల్లప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది. అతి మధురం చూర్ణంలో పెరుగు లేదా తేనెను కూడా కలపవచ్చు. ఈ మిశ్రమం కూడా చక్కని ఫేస్ ప్యాక్ లా పనిచేస్తుంది. దీన్ని కూడా ముఖానికి రాసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. తరచూ ఈ ఫేస్ ప్యాక్‌ను వాడుతుంటే ముఖం మెరిసిపోతుంది. ఇలా అతి మధురం చూర్ణంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.