Custard Apple Leaves | సీతా ఫలం పండ్లు మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లు ఎంతో తియ్యగా ఉంటాయి. కనుక వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. సీతా ఫలం పండ్లు మనకు శీతాకాలంలోనే లభిస్తాయి. కానీ ఈ పండ్లు ఎంతటి లాభాలను అందిస్తాయో వీటి ఆకులు కూడా మనకు అన్నే ప్రయోజనాలను అందిస్తాయి. సీతా ఫలం చెట్టు ఆకులను ఉపయోగించి పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. సీతాఫలం ఆకులను పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సీతా ఫలం ఆకుల్లో విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను పేస్ట్‌లా చేసి ముఖానికి రాస్తుంటే ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి అందంగా కనిపిస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
గాయాలు, పుండ్లను మానేలా చేయడంలోనూ ఈ ఆకులు ఎంతో పనిచేస్తాయి. ఈ ఆకులను మెత్తని మిశ్రమంలా చేసి గాయాలు, పుండ్లపై రాసి కట్టులా కడుతుంటే త్వరగా అవి మానిపోతాయి. అలాగే గజ్జి, తామర, ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మంపై ఏర్పడే దురదలు, దద్దుర్లను సైతం ఈ ఆకులు తగ్గిస్తాయి. సీతాఫలం ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను ఉపయోగిస్తే ఎలాంటి చర్మ సమస్యలు అయినా సరే తగ్గిపోతాయి. అలాగే ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి కూడా చర్మ సమస్యలను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. పేలు బాగా ఉన్నవారు సీతాఫలం ఆకులను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. సీతాఫలం ఆకులను మిశ్రమంగా చేసి అందులో కాస్త ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే తలలో ఉండే పేలు పోతాయి. చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. తలలో ఉండే దురద తగ్గుతుంది. జుట్టు ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి సీతాఫలం ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో ఉదయం, సాయంత్రం తాగుతుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడమే కాక, ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. అలాగే వాపులు, నొప్పులను తగ్గించడంలోనూ ఈ ఆకులు ఎంతగానో పనిచేస్తాయి. ఈ ఆకుల్లో అనాల్జెసిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను పెనంపై కాస్త వేడి చేసి నొప్పులు, వాపులు ఉన్న చోట వేసి కట్టు కట్టాలి. రాత్రి పూట ఇలా చేయాలి. దీంతో మరుసటి రోజు ఉదయం వరకు నొప్పి మొత్తం తగ్గుతుంది. వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ చిట్కా ఎంతగానో పనిచేస్తుంది.
మలబద్దకం సమస్య ఉన్నవారు సీతాఫలం పండ్లను తింటే సమస్య త్వరగా తగ్గుతుంది. అదే విరేచనాలు అవుతున్న వారు పండ్లను తినకూడదు. కానీ ఆకులను ఉపయోగించవచ్చు. సీతాఫలం ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే విరేచనాలు తగ్గిపోతాయి. సీతాఫలం ఆకుల్లో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవి గుండె కండరాలను ప్రశాంత పరుస్తాయి. దీంతో రక్త నాళాలు వెడల్పుగా మారుతాయి. ఫలితంగా రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. సీతాఫలం ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అయితే ఇలా జరగాలంటే ఈ నీళ్లను ఉదయం తాగితే మంచిది. ఇలా సీతాఫలం ఆకులు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. కనుక మీకున్న ఆరోగ్య సమస్యలను ఈ ఆకులతో పైన చెప్పిన విధంగా తగ్గించుకోండి.