Baking Soda | బేకింగ్ సోడా గురించి అందరికీ తెలిసిందే. దీన్నే వంట సోడా అని కూడా పిలుస్తారు. వంటల్లో దీన్ని ఎక్కువగా వేస్తుంటారు. సోడియం బైకార్బొనేట్ అనే రసాయన నామంతోనూ దీన్ని పిలుస్తారు. అయితే ఇది రసాయనం అయినప్పటికీ సహజసిద్ధమైన పదార్థంగానే పనిచేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి అనేక లాభాలను అందిస్తుంది. బేకింగ్ సోడాను పలు ఇంటి చిట్కాల్లో విరివిగా ఉపయోగిస్తారు. బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. బేకింగ్ సోడా దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. దీన్ని వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.బేకింగ్ సోడాలో సోడియం అధికంగా ఉంటుంది కనుక కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీన్ని వాడకూడదు. ఇక బేకింగ్ సోడాను పలు ఇంటి చిట్కాల్లో ఉపయోగిస్తే అనేక లాభాలను పొందవచ్చు.
గుండెల్లో మంట, కడుపులో మంట సమస్యకు బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకు గాను అర టీస్పూన్ బేకింగ్ సోడాను 120 ఎంఎల్ నీటిలో వేసి కరిగించి నెమ్మదిగా తాగాలి. దీని వల్ల పొట్టలో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది. గుండెల్లో, కడుపులో మంట, అజీర్తి నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యకు కూడా ఇది పనిచేస్తుంది. ఇందుకు గాను ముందు చెప్పినట్లుగానే బేకింగ్ సోడాను నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. దీని వల్ల జీర్ణాశయంలోని యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్ట ఉబ్బరం తగ్గిపోతుంది. అలాగే మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉన్నవారు కూడా బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. ఇందుకు గాను అర టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటిలో కలిపి ఉదయం పరగడుపునే ఈ మిశ్రమాన్ని తాగాల్సి ఉంటుంది. దీని వల్ల మూత్రంలో వచ్చే ఆమ్లాల ప్రభావం తగ్గుతుంది. మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు సైతం తగ్గిపోతాయి.
వ్యాయామం చేసేవారికి బేకింగ్ సోడా ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేయడానికి 60 నిమిషాల ముందు బేకింగ్ సోడాను తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా వ్యాయామం చేయగలుగుతారు. మరిన్ని క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. ఇక బేకింగ్ సోడాకు కాస్త నీటిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని చంకల్లో రాసుకోవాలి. ఇది సహజసిద్ధమైన డియోడరెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల చెమట అధికంగా ఉత్పత్తి కాకుండా ఉంటుంది. చెమట దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. అలాగే బేకింగ్ సోడా, నీటి మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి రాయడం వల్ల చర్మంపై ఉండే దురదలు తగ్గిపోతాయి. పురుగులు కుట్టిన చోట రాస్తుంటే నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండ వల్ల కందిన చర్మంపై రాస్తుంటే చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. చర్మ సంరక్షణకు బేకింగ్ సోడా మేలు చేస్తుంది.
బేకింగ్ సోడాకు నీటిని కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా రాయవచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మృత కణాలు తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. అదేవిధంగా గోరు వెచ్చని నీటిలో బేకింగ్ సోడాను కలిపి ఆ నీళ్లను మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఇక బేకింగ్ సోడా, నీటి మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి దాంతో దంతాలను తోముకుంటే దంతాలపై ఉండే పాచి, గార తొలగిపోయి దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. ఈ విధంగా బేకింగ్ సోడా మనకు అనేక ఇంటి చిట్కాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే హైబీపీ ఉన్నవారు, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు బేకింగ్ సోడాను వాడకూడదు. 6 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు కూడా దీన్ని ఇవ్వకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ బేకింగ్ సోడాను వాడితే అనేక లాభాలను పొందవచ్చు.