బట్టతల సమస్య అనేది ప్రస్తుతం చాలా మంది పురుషులను ఇబ్బందులకు గురి చేస్తోంది. స్త్రీలలో ఈ సమస్య దాదాపుగా ఉండదనే చెప్పాలి. కేవలం పురుషుల్లోనే ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా చాలా మందికి బట్టతల అనేది వంశ పారంపర్యంగా వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా లేదా తమ పూర్వం తరాల వారికి పురుషులకు ఎవరికైనా బట్టతల ఉంటే ఆ కుటుంబంలో లేదా వంశంలో ముందు తరాల వారికి బట్టతల వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో యుక్త వయస్సులో ఉన్నవారికే ఇలా జరుగుతుంది. అలాగే పురుషుల్లో ఉండే హార్మోన్ల సమస్యల మూలంగా కూడా బట్టతల వస్తుంది. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం లేదా ఆగిపోవడం, థైరాయిడ్ పనితీరు సరిగ్గా లేకపోవడం వంటివి బట్టతల వచ్చేందుకు కారణం అవుతాయి.
ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారిలో, కుదుళ్ల ఇన్ఫెక్షన్లు వచ్చిన వారిలోనూ బట్టతల వచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. క్యాన్సర్, ఆర్థరైటిస్ మందులను వాడే వారికి, డిప్రెషన్ లేదా గుండె సమస్యలకు మెడిసిన్లను వేసుకునే వారికి, హైబీపీ ఉండే మందులను వాడుతుంటే, రేడియేషన్ థెరపీ చేయించుకుంటే, తీవ్రమైన ఒత్తిడి లేదా మానసిక సమస్యలు ఉంటే అలాంటి వారికి బట్టతల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక కొందరు హెయిర్ స్టైల్ కోసం పలు ట్రీట్మెంట్లను బ్యూటీపార్లర్లలో తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి చికిత్సలు జుట్టుకు పడకపోతతే అప్పుడు తీవ్రంగా జుట్టును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అది బట్టతలకు దారి తీస్తుంది.
బట్టతల వచ్చిన వారు అధునాతన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలను చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే ఖరీదైన చికిత్సలు చేయించుకోలేని వారు పలు ఇంటి చిట్కాలను పాటించవచ్చు. దీంతో బట్టతలపై శిరోజాలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే.. కొబ్బరినూనె, బాదంనూనె, ఆలివ్ ఆయిల్.. ఈ మూడు నూనెలను సమాన భాగాల్లో తీసుకుని కలిపి ఒక సీసాలో నిల్వ చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ కొద్దిగా తీసుకుని జుట్టుకు సున్నితంగా మసాజ్ చేసినట్లు రాస్తుండాలి. ఈ మూడు నూనెల్లో ఉండే పోషకాలు జుట్టును పెరిగేలా చేస్తాయి. బట్టతల ఉన్నవారికి ఈ చిట్కా బాగానే పనిచేస్తుంది. అలాగే కలబంద గుజ్జును తరచూ తల మీద అప్లై చేస్తుండడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. శిరోజాలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.
ఉల్లిపాయ రసం, వెల్లుల్లి రసం తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తున్నా కూడా రాలిపోయిన వెంట్రుకలను మళ్లీ మొలిచేలా చేయవచ్చు. అల్లం రసం కూడా శిరోజాలను పెరిగేలా చేస్తుంది. గ్రీన్ టీని తయారు చేసిన తరువాత చల్లార్చి దాన్ని తలపై అప్లై చేయాలి. కాసేపటికి కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే మందార పువ్వు, ఆకుల మిశ్రమాన్ని కూడా తలకు రాయవచ్చు. మెంతుల పొడి, రోజ్ మేరీ ఆయిల్‌ను కలిపి రాస్తున్నా కూడా శిరోజాలు మళ్లీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ చిట్కాలు అందరికీ పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. వీటిని పాటించినా కూడా శిరోజాలు పెరగడం లేదంటే అది తీవ్రమైన సమస్యగా భావించాలి. తప్పదు అనుకుంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్స తీసుకోవచ్చు.