Baking Soda | బేకింగ్ సోడా.. వంట చేసే అందరికీ దీని గురించి తెలుసు. కొందరు బేకింగ్ పౌడర్‌ను బేకింగ్ సోడా అనుకుంటారు. కానీ బేకింగ్ పౌడర్ వేరే. బేకింగ్ సోడా వేరే. బేకింగ్ పౌడర్‌ను ఎక్కువగా కేకులు, బిస్కెట్లు, సలాడ్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే బేకింగ్ సోడాతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పలు ఇంటి చిట్కాల్లోనూ బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడానే సోడియం బైకార్బొనేట్ అని కూడా అంటారు. దీన్నే తినే సోడా అని కూడా పిలుస్తారు. బేకింగ్ సోడా క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. కనుక పొట్టలో ఆమ్లత్వం అధికమైనప్పుడు బేకింగ్ సోడా కలిపిన నీళ్లను తాగితే ఉపశమనం లభిస్తుంది.
పొట్టలో పలు సందర్భాల్లో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయి గ్యాస్, అసిడిటీ వస్తాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కలిపి తాగితే పొట్టలో ఉండే ఆమ్లాలు తటస్థీకరించబడతాయి. దీంతో అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. మాంసాహారం తిన్నప్పుడు కొందరికి సరిగ్గా ఆహారం జీర్ణం కాదు. దీంతో అజీర్తి ఏర్పడి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా బేకింగ్ సోడాను నీటిలో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో బేకింగ్ సోడా ఎంతగానో పనిచేస్తుంది. ఇది మాంసాన్ని జీర్ణం చేయడంలో దోహదం చేస్తుంది. బేకింగ్ సోడాను వంటల్లో ఉపయోగిస్తారు. మటన్ వంటి ఆహారాలు త్వరగా ఉడకాలంటే అందులో కాస్త బేకింగ్ సోడాను వేయాలి.
బేకింగ్ సోడాతో ఫర్నిచర్ మీద ఉండే మరకలను తొలగించవచ్చు. పెన్సిల్ లేదా క్రేయాన్ గీతలు, ఇంకు మరకలు ఉంటే బేకింగ్ సోడా పోగొడుతుంది. తడిపిన స్పాంజ్ మీద కాస్త బేకింగ్ సోడా చల్లి దాంతో మరకల మీద రుద్దాలి. దీంతో మరకలు పోతాయి. ఒక లీటర్ నీళ్ళలో కొస్త బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేయాలి. దీంతో ఫ్లాస్క్‌లో వచ్చే దుర్వాసన మాయం అవుతుంది.కూరగాయలు లేక పండ్ల మీద ఉన్న పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే చాలు. మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి. తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన, రుచికరమైన మాంసం తయారవుతంది.
తడిపిన స్పాంజ్ మీద కాస్త బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే ఫ్రిజ్ శుభ్రంగా మారుతుంది. దీంతో ఫ్రిజ్ లోపల కూడా శుభ్రం చేయవచ్చు. దీని వల్ల ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. ఒక చిన్న బాక్స్ తీసుకుని అందులో కాస్త బేకింగ్ సోడాను వేసి దాన్ని ఫ్రిజ్ లో పెట్టినా చాలు, ఫ్రిజ్ నుంచి వాసనలు రాకుండా ఉంటాయి. చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాల్లో బేకింగ్ సోడాను రాసి 30 నిమిషాలు అయ్యాక స్నానం చేయాలి. దీంతో చెమట ద్వారా వచ్చే దుర్వాసన తగ్గిపోతుంది. టమాటా సూప్‌లో కాస్త బేకింగ్ సోడాను వేస్తే మంచి రుచి వస్తుంది. పొట్టలో అసౌకర్యంగా ఉంటే కాస్త బేకింగ్ సోడా కలిపిన నీళ్లను తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ చిట్కాను తరచూ ఉపయోగించకూడదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడాలి.
బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమంతో వంట గదిలో గ్యాస్ స్టవ్ మీద, చుట్టు పక్కల తుడిచి అనంతరం తడి వస్త్రంతో శుభ్రం చేయాలి. తరువాత పొడి వస్త్రాన్ని ఉపయోగించి తుడిచేయాలి. దీంతో కిచెన్ క్లీన్‌గా మారుతుంది. దుర్వాసన పోతుంది. గోరు వెచ్చని నీటిలో కాస్త బేకింగ్ సోడాను వేయాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి అందులో దువ్వెనలు, బ్రష్‌లు వంటి వాటిని వేసి కాసేపు ఉండనివ్వాలి. తరువాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే దువ్వెనలు, బ్రష్‌లు క్లీన్ అవుతాయి. మురికిపోతుంది. అయితే బేకింగ్ సోడాను తరచూ వంటల్లో ఉపయోగించకూడదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. బేకింగ్ సోడా వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు నశించే ప్రమాదం ఉంది. కనుక వంట చేసేటప్పుడు వీలైనంత తక్కువగానే దీన్ని ఉపయోగించాలి.