Holy Basil Water | ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధపరంగా కూడా తులసిమొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. తులసి ఆకుల నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు, ముఖ్యమైన నూనెలు ఉంటాయి. తులసి నీరు శరీరం మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి సహాయపడతాయి. తులసి నీటిని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య లాభాలను పొందవచ్చు. తులసి నీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తున్నారు.
తులసి నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ఇన్పెక్షన్ లను తగ్గించడంలో సహాయపడతాయి. తరచూ ఇన్పెక్షన్ ల బారిన పడే వారు తులసి నీటిని తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. తులసి నీటిలో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. తులసి నీరు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కావల్సిన జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నీటిలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రేగుల వాపును, అజీర్ణం, యాసిడ్ రిప్లెక్స్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
తులసి నీటిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాయుమార్గాల్లో శ్లేష్మాన్ని తొలగించడంలో కూడా ఈ నీరు మనకు సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా తులసి ఆకుల నీరు మనకు ఉపయోగపడుతుంది. తులసి నీరు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గించడంలో, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారించడంలో కూడా తులసి నీరు మనకు సహాయపడుతుంది. తులసి నీటిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తులసి నీటిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగడం లేదా తగ్గడం వంటివి జరగకుండా ఉంటుంది.
తులసి నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నీరు శరీరంలో వ్యర్థాలను తొలగిస్తుంది. దీంతో కాంతివంతమైన చర్మాన్ని మనం పొందవచ్చు. వీటిలో ఉండే యాంటీమైక్రోబయాల్ లక్షణాలు మొటిమలు రాకుండా కాపాడడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల చర్మపు మంట, ఎరుపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తులసి నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. మూత్రపిండాల్లో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగేలా చేయడంలో దోహదపడతాయి. దీంతో మూత్రపిండాల్లో విష పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పకుండా ఉంటాయి. తులసి నీరు శరీరంలో జీవక్రియలను పెంచుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చు చేయబడతాయి. తద్వారా శరీర బరువు అదుపులో ఉంటుంది.
తులసి నీటిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో నోటిదుర్వాసన తగ్గడంతో పాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా తులసి నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉదయం పూట తీసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.