చాలామంది పెద్దవారిలో తుంటి ఎముకలు విరగడం తరచుగా చూస్తుంటాం. వయసులో ఉన్నవారికంటే వార్ధక్యంలో ఉన్నవారిలోనే ఎక్కువగా తుంటి ఎముక విరగడం జరుగుతుంటుంది. ప్రమాదవశాత్తు వారు కింద పడిపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంటుంది. వృద్ధుల్లో ఎముకలు బలహీనంగా ఉంటాయి. చిన్నపాటి దెబ్బ తగిలినా అవి విరిగే ప్రమాదం ఎక్కువ. అయితే, వయసులో ఉన్నవారిలో కంటే వృద్ధుల్లో
ఎముకలు అతకడం చాలా కష్టం. అంతేకాదు, ఎముకలు విరిగినప్పుడు సమస్య అంతటితో ఆగకుండా ఇతర రుగ్మతలకు దారితీసి ప్రాణాపాయంగా మారే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే, వయసు పైబడిన వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం చాలా అవసరం అంటున్నారు వైద్యులు. అయితే అన్ని సమయాలు మనవి కావు, కనుక అనుకోకుండా పెద్దవారిలో తుంటి ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి, హిప్ ఫ్రాక్చర్ వల్ల కలిగే ఇతర అనర్థాలేంటి, చికిత్స కోసం అందుబాటులో ఉన్న వైద్య పద్ధతులేంటి తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
సాధారణంగా వయస్సు పైబడిన వారు కింద పడటం వల్ల హిప్ ఫ్రాక్చర్స్ జరుగుతుంటాయి. వయసు రీత్య పెద్దవారిలో కంటి చూపు మందగిస్తుంది. దీంతో నేల ఉపరితలంపై ఉన్న ఎత్తు పల్లాలను వారు సరిగ్గా అంచనా వేయలేకపోతారు. మెట్లు ఎక్కడం లేదా దిగే సమయంలో చూపు ఆనక కింద పడటం, కండరాల బలహీనత వల్ల నడిచేటప్పుడు, కూర్చున్న చోటి నుంచి పైకి లేచేటప్పుడు, కూర్చునేటప్పుడు పట్టు తప్పి కింద పడిపోయే అవకాశాలూ ఉంటాయి. అంతేకాకుండా, డయాబెటిస్, న్యూరోపతి, బీపీ మందులు వాడుతుండటం వల్ల కొన్నిసార్లు కళ్లు తిరిగి కింద పడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా చాలామంది వృద్ధులు రాత్రి సమయాల్లో బాత్రూమ్కు వెళ్లినప్పుడు జారి పడుతుంటారు.
వీళ్లు బాత్రూమ్కు వెళ్తే కాళ్లు కడుక్కోకుండా ఉండలేరు. తడికాళ్లతో ఫ్లోర్‌పై నడిచినప్పుడు అది నునుపుగా ఉండటం వల్ల జారిపడే అవకాశాలు పెరుగుతాయి. ఈ విధంగా కిందపడిన సమయంలో చెయ్యి కింద పెడితే మణికట్టు (రిస్ట్ జాయింట్), పిరుదు మీద పడినప్పుడు తుంటి ఎముక ఫ్రాక్చర్ అవుతుంది. వయసు పెరిగే కొద్ది శరీరంలో క్యాల్షియం స్థాయులు తగ్గుతూ ఎముకలు బలహీనపడతాయి. అంటే ఎముకలు పటుత్వాన్ని కోల్పోయి చిన్నపాటి గాయమైనా విరిగిపోతాయి. అంతే కాకుండా విరిగిన ఎముకలు తిరిగి అతుక్కోవడం కూడా చాలా కష్టం.
హిప్ ఫ్రాక్చర్ అనేది సెమీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. తుంటి ఎముక విరిగినప్పుడు ఎక్కువ రోజులు బెడ్‌పై ఉంచడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అందుకని విదేశాల్లో అయితే కిందపడి గాయమైన రోజే శస్త్రచికిత్స చేస్తారు. అదే మనదేశంలో అయితే రోగికి బీపీ, షుగర్, గుండె తదితర సమస్యలు పరీక్షించి, ఉన్న సమస్యలను నియంత్రించిన తరువాత సర్జరీ చేస్తారు. అందుకోసం ఒకటి రెండు రోజుల సమయం తీసుకోవాల్సి రావచ్చు. హిప్ ఫ్రాక్చర్‌కు సర్జరీ ఒక్కటే మార్గం. శస్త్రచికిత్స లేకుండా కట్టు కట్టి చికిత్స చేయాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఆ సమయంలో ఇతర సమస్యలు ఉత్పన్నమై ప్రాణాపాయ స్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
వయసు పెరిగి, ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉన్నవారికి శస్త్రచికిత్సల ఆవశ్యకత కూడా అంతే ఉంటుంది. 100 మందికి హిప్ ఫ్రాక్చర్ అయిన వారిలో శస్త్రచికిత్స తర్వాత దాదాపు 15 శాతం మంది ఏడాదిలోపు మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో శస్త్రచికిత్స చేయనివారిలో ఏడాదిలోపు కాలం చేసేవారి సంఖ్య 30 శాతంగా ఉంది. అంటే ఆపరేషన్ వల్ల మరణాల రేటు తగ్గుతుంది. ఆపరేషన్ లేకుండా పూర్వస్థితి రావడం చాలా అరుదు. అదే సర్జరీ చేయడం వల్ల ప్రాణ నష్టం తగ్గడమే కాకుండా హిప్జాయింట్ నిర్మాణం పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా వారు పూర్వంలానే తమ పనులు తాము చేసుకోగలుగుతారు. అందుకని సాధ్యమైనంత వరకు హిప్ ఫ్రాక్చర్ బాధితులకు సర్జరీ ద్వారానే చికిత్స అందించడం జరుగుతుంది.
విరిగిన తుంటి ఎముకను మళ్లీ అతికించడం కోసం ప్లేట్లు, స్క్రూలు వంటి వాటిని వినియోగిస్తారు. హిప్జాయింట్లో ఉన్న బంతి విరిగిపోతే ఆ బంతిని తొలగించి కృత్రిమ బంతిని మార్పిడి చేస్తారు. దీనినే కీలు మార్పిడి లేదా పాక్షిక లేదా మొత్తం హిప్ రీప్లేస్మెంట్ అంటారు. సర్జరీ తరువాత మరుసటి రోజు నుంచే కూర్చోబెట్టడం, నిల్చోబెట్టడం, వీలైతే నడిపించేందుకు కూడా యత్నిస్తారు. ఉన్న సమస్యలను నియంత్రించుకుని, వీలైనంత త్వరగా సర్జరీ చేసి, సాధ్యమైనంత త్వరగా రోగిని నడిపించడం, కూర్చోబెట్టడం, నిల్చోబెట్టడం చేస్తారు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ ఎం. హరిశర్మ
సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్
అపోలో హాస్పిటల్, హైదరాబాద్