High Cholesterol Symptoms In Legs | ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు. ఒకప్పుడు కేవలం వృద్ధాప్య దశలో ఉన్నవారికి మాత్రమే హార్ట్ ఎటాక్ వచ్చేది. కానీ ఇప్పుడు పిల్లలకు కూడా గుండె పోటు వస్తోంది. దీన్ని బట్టి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే గుండె పోటు వచ్చేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి.. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవడమే. దీన్ని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. దీంతో హార్ట్ ఎటాక్ వస్తోంది. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే శరీరం మనకు పలు సూచనలు ఇస్తుంది. దాన్ని బట్టి మనకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే శరీరం తెలియజేసే ఆ లక్షణాలు ఏమిటంటే..
శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కాళ్లు, పాదాల్లో పలు సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోతాయి. కొందరు దీన్ని థైరాయిడ్ లేదా మెగ్నిషియం లోపం అనుకుంటారు. కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా కూడా ఇలాగే జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల కాళ్లలో ఉండే రక్తనాళాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీంతో అక్కడ భాగంలో నొప్పి మొదలై పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. ఇలా గనక రాత్రి పూట జరుగుతుందంటే కచ్చితంగా కొలెస్ట్రాల్ ఉందని అనుమానించాలి.
ఇక కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కాళ్లు లేదా పాదాలు కొన్నిసార్లు స్పర్శ లేనట్లు అనిపిస్తాయి. అలాగే సూదులతో పాదాల్లో గుచ్చినట్లు అనిపిస్తుంది. ఇలా జరుగుతున్నా కూడా కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే పాదాలకు రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీంతో అక్కడి భాగం అంతా చల్లగా ఉంటుంది. పాదాలు తరచూ చల్లగా ఉంటున్నాయంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందేమో చెక్ చేయించుకోండి.
చర్మం తరచూ దురదలు పెడుతున్నా, ఎరుపెక్కినా లేదా వేరే రంగులోకి మారినా, చర్మంలో తరచూ మార్పులు వస్తున్నా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఛాతిలో పట్టేసినట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ కొలెస్ట్రాల్ అధికంగా ఉందని తెలియజేసేవే. కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు.
కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు మద్యం ఎట్టి పరిస్థితిలోనూ సేవించకూడదు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, నట్స్, విత్తనాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల లేదా ఒక దానిమ్మ పండును తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది.