అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. బందిపోటులా విరుచుకుపడుతుంది. సకాలంలో స్పందించకపోతే అకస్మాత్తుగా ప్రాణం తీస్తుంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం తదితర కారణాల వల్ల ఈ మధ్య కాలంలో రక్తపోటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ప్రతి 100 మందిలో 45 మందికి రక్తపోటు సమస్య ఉన్నదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్తపోటు అధికంగా (హైపర్ టెన్షన్) ఉన్నా లేదా రక్తపోటు తక్కువగా ఉన్నా ప్రమాదమే. రెండు సమస్యలు కూడా ప్రాణాంతకమే! అసలు హైపర్‌టెన్షన్ అంటే ఏమిటి? ఇది రావడానికి గల కారణాలు, సాధారణంగా ఎంత ఉండాలి? అధిక రక్తపోటు వల్ల కలిగే అనర్థాలు, రక్తపోటు పడిపోవడం వల్ల కలిగే నష్టాలు, అధిక రక్తపోటు సమస్య రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్య ఉన్నవారు పాటించాల్సిన నియమాలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం..
గుండె, రక్తనాళాల్లో ప్రవహించే రక్తం వాటి గోడలపై చూపించే ఒత్తిడి లేదా పీడనాన్ని రక్తపోటు అంటారు. వాస్తవానికి రక్తపోటు అనేది రోగం కాదు. రోగ లక్షణమూ కాదు. అదొక జీవ లక్షణం. సాధారణంగా ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిని సంక్షిప్తంగా వర్ణించడానికి వైద్యులు నాలుగు రకాల వైటల్ సైన్లను (జీవ లక్షణాలు లేదా గుర్తులు)ను పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 1.శరీర ఉష్ణోగ్రత 2. నాడి లేదా హృదయ స్పందన (పల్స్ రేట్ లేదా హార్ట్ బీట్). 3. రెస్పిరేషన్ రేట్ 4. రక్త పోటు (బ్లడ్ ప్రెషర్). మనిషిలో ఈ నాలుగు జీవ లక్షణాలు లేకపోతే సదరు వ్యక్తి మరణించినట్లు నిర్ధారిస్తారు. అంటే ఒక వ్యక్తి ప్రాణాలతో ఉండాలంటే ఆ శరీరంలో సాధారణ ఉష్ణోగ్రత, నాడి, హృదయ స్పందన, రెస్పిరేషన్, బీపీ ఉండాల్సిందే. అంతేకాకుండా ఈ నాలుగు జీవ లక్షణాలు సైతం నిర్ణీత పరిధిలోనే ఉండాలి. వాటిలో హెచ్చుతగ్గులు ఏర్పడితే అనారోగ్యం తప్పదు. మితిమీరితే మరణం తప్పదు.
సాధారణంగా రక్తపోటు అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. అయితే ఉండాల్సిన దాని కంటే అధికంగా ఉంటే దానిని అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అంటారు. ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే దానిని హైపోటెన్షన్ లేదా లో-బీపీ అని పిలుస్తారు.

రక్తపోటు అనేది మన గుండె ఎంత కష్టపడి పనిచేస్తున్నదో సూచిస్తుంది. రక్తనాళాల్లో రక్తం అలల మాదిరి ఉరకలు వేస్తూ ప్రవహించడం వల్ల రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి గుండెకు దగ్గరగా ఉన్నప్పుడు అధికంగానూ, దూరం వెళ్తున్న కొద్ది తగ్గుతూ కేశనాళికల దగ్గర నెమ్మదిగా ప్రవహించి సిరలకు చేరుకుంటుంది. సిరల ద్వారా మరింత నెమ్మదిగా కండరాల సహాయంతో మళ్లీ గుండెకు చేరుకుంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన పీడనం ఉండటం వల్ల శరీరమంతటా రక్తపోటు ఒకేలా ఉండదు. ఈ పీడనం అనేది శరీరమంతా ఒకేలా ఉండనందున సాధారణంగా జబ్బ మీద ఈ రక్తపోటును కొలవడం జరుగుతుంది. ఈ రక్తపోటు అనేది మారుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, పరిసరాలు అంటే కొంత మందికి వైద్యులను చూసినా లేదా అక్కడున్న వైద్యపరికరాలను చూసినా గుండె దడ పెరిగి రక్తపోటు పెరుగుతుంది.
సాధారణంగా గుండె కొట్టుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే గుండె కొట్టుకునే ప్రక్రియలో దగ్గరకు ముడుచుకున్నప్పుడు రక్తం ఒక్క ఉదుటున ముందుకు దుంకుతుంది. ఆ సమయంలో రక్తపోటు అధికంగా ఉంటుంది. దీనినే సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఈ పోటు విలువ 100 నుంచి 140 mmHg ఉంటే దానిని సాధారణంగా పరిగణిస్తారు. గుండె వ్యాకోచించినప్పుడు లేదా వికసించుకున్నప్పుడు రక్తప్రవాహ పీడనం తక్కువగా ఉంటుంది. దీనినే డయస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఇందులో పీడనం 60-90 లోపు ఉంటే దానిని సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. గతంలో అయితే ఆరోగ్యవంతునిలో రక్తపోటు 120/80గా పరిగణించేవారు. మారుతున్న పరిస్థితుల ఆధారంగా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం 140/90ని సాధారణ రక్తపోటుగా పరిగణిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువగా ఉంటే వారు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లుగా గుర్తించి వెంటనే చికిత్స అందించాల్సి ఉంటుంది.
హైపర్‌టెన్షన్ రెండు రకాలు. అందులో ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఈ రకం హైపర్‌టెన్షన్‌కు కారణాలు ఉండవు. అంటే ఇది రావడానికి గల కచ్చితమైన కారణాలు చెప్పలేం. ఇక రెండోది సెకండరీ హైపర్ టెన్షన్. ఇతర కారణాల వల్ల ఈ సెకండరీ హైపర్ టెన్షన్ వస్తుంది. అంటే కారణాలు లేకుండా వచ్చేదాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్గాను, కారణాల వల్ల వచ్చే అధిక రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్‌గా పిలుస్తారు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ రాకేష్ సాహె
ఎండోక్రైనాలజిస్ట్
సూపరింటెండెంట్,
ఉస్మానియా జనరల్ హాస్పిటల్,
హైదరాబాద్