Hibiscus | మందార చెట్లు సహజంగానే మన అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మందార మొక్క ఉంటుంది. ఇవి రంగు రంగుల పూలను పూస్తాయి. అయితే ఎరుపు రంగు రకానికి చెందిన ఒంటి రెక్క మందార పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పువ్వులను ఎండబెట్టి వాటిని నీటిలో వేసి మరిగించి డికాషన్లా తయారు చేసి తాగవచ్చు. అలాగే మందార ఆకులు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మందార చెట్టు ఎల్లప్పుడూ పూలను పూస్తూనే ఉంటుంది. దీనికి పెద్దగా పోషణ కూడా అవసరం లేదు. తరచూ కొన్ని నీళ్లను పోస్తే చాలు, చెట్టు చక్కగా పెరుగుతుంది. ఈ చెట్లు మనకు ప్రతి సీజన్లోనూ పచ్చగానే కనిపిస్తుంటాయి. మందార పువ్వులను చూడగానే మనస్సుకు ఎంతోఆహ్లాదం కలుగుతుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ చెట్లను కుండీల్లో కూడా పెంచవచ్చు.
ఒంటి రెక్క ఎర్ర మందారం పువ్వులలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఈ పువ్వులు ఎంతో మేలు చేస్తాయి. మందారాలనే హైబిస్కస్ అని కూడా ఇంగ్లిష్లో పిలుస్తారు. మందార పువ్వులను కొందరు ఇతర పదార్థాలతో కలిపి తింటారు. ఈ పువ్వులను పలు ఔషధాల తయారీలలో, సౌందర్య సాధన ఉత్పత్తులలోనూ వాడుతారు. మనం ఆరోగ్యంగా ఉండేందుకు మందార ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వులను యునాని మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పువ్వులు లేదా ఆకులతో డికాషన్ తయారు చేసి తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి ఈ పువ్వులు ఎంతో మేలు చేస్తాయి.
మందార పువ్వులలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. హైబీపీ అదుపులో ఉంటుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు, గొంతు సమస్యలు ఉన్నవారు మందార పువ్వులను ఔషధంగా ఉపయోగించవచ్చు. దీంతో ఆయా వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. మందార పువ్వుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ పువ్వుల్లో క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. దంతాలు దృఢంగా ఉండేలా చేస్తుంది.
మందార పువ్వుల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం ఉన్నవారు ఈ పువ్వులతో తయారు చేసిన టీని తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ఆయా సమస్యలు తగ్గిపోతాయి. మందార పువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఈ పువ్వుల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్ యాసిడ్, ఆక్సీలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మందార పువ్వుల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. మందార పువ్వులతో టీ తయారు చేసి తాగవచ్చు. లేదా ఈ పువ్వులను పొడిగా చేసి మీరు రోజూ తినే పదార్థాలపై చల్లి తినవచ్చు. ఇలా ఏ రకంగా తీసుకున్నా కూడా మందార పువ్వులతో అనేక లాభాలను పొందవచ్చు.