Green Gram Sprouts | ఆరోగ్యం కోసం మొలకలను రోజూ తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు తరచూ చెబుతుంటారు. మొలకలను తింటే అనేక పోషకాలు లభించడమే కాక, పలు వ్యాధులను సైతం నయం చేస్తాయి. ఈ క్రమంలోనే మొలకల్లోనే పెసర మొలకలు చాలా ముఖ్యమైనవని చెప్పవచ్చు. వీటిని త్వరగా మొలకలుగా తయారు చేయవచ్చు. రుచిగా కూడా ఉంటాయి. మొలకలను తయారు చేసేందుకు గాను 1 కప్పు పెసలను ముందుగా తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగిన తరువాత ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లను పోసి దాంట్లో పెసలను మునిగేలా వేయాలి. అనంతరం ఆ పెసలను కనీసం 8 నుంచి 12 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. లేదా రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. అలా నానిన పెసలను తీసి ఒక శుభ్రమైన వస్త్రంలో వేసి ముడిలా కట్టాలి. అనంతరం ఆ పెసలను వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. 24 గంటల తరువాత ఆ పెసలకు మొలకలు వస్తాయి.
అలా మొలకలు వచ్చిన తరువాత పెసలను తీసి బాగా కడిగి తినాలి. నేరుగా తినలేమని అనుకుంటే వాటిని పెనంపై నెయ్యితో కాస్త వేయించి తినాలి. లేదా సలాడ్‌లా తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఈ పెసలను సాయంత్రం సమయంలో స్నాక్స్‌లా తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు, రాత్రి పూట ఆహారం ఎక్కువగా తినకుండా ఉంటారు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. పెసలను ఇలా ఎప్పటికప్పుడు తయారు చేసుకుని రోజుకు ఒక కప్పు మోతాదులో తినవచ్చు. లేదా ఒకసారి తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టి 2 లేదా 3 రోజుల వరకు రోజూ తినవచ్చు. ఇలా పెసలను తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి.
పెసలలో సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అంతేకాదు, పెసలలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకోవాలంటే వాటిని మనం మొలకల రూపంలో తినాలి. దీంతో అనేక పోషకాలు లభిస్తాయి. పెసర మొలకలను ఉదయం లేదా సాయంత్రం తినవచ్చు. రాత్రి పూట తినకూడదు. తింటే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మొలకలను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. పెసలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక నాన్ వెజ్ తినని వారికి ఇవి ఉత్తమ ఆహారంగా పనిచేస్తాయి. మొలకలను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కండరాలకు మరమ్మత్తులు చేసి శక్తిని అందిస్తాయి. కండరాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. దీని వల్ల కండరాల నొప్పులు సైతం తగ్గిపోతాయి.
పెసర మొలకల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు సి, ఎ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులు తగ్గిపోతాయి. పెసలను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. పెసర మొలకలను తింటుంటే షుగర్ లెవల్స్ సైతం నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు మొలకలను రోజూ తింటుంటే కొద్ది రోజులకు కొలెస్ట్రాల్ పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. ఇలా మొలకలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.