Almond Milk | బాదంపప్పును తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బాదంపప్పును గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని పొట్టు తీసి తినాలి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు, పోషకాలు సరిగ్గా లభించేందుకు గాను బాదంపప్పును రోజూ తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. అయితే బాదంపప్పును రోజూ తినడం ఇబ్బందిగా ఉందని భావించే వారు బాదంపాలను ఒకేసారి తయారు చేసి వాటిని నిల్వ చేసుకుని రోజూ కాస్త మోతాదులో తాగవచ్చు. ఇది చాలా సులభతరమైన పనే కాదు, రోజూ బాదంపప్పును తిన్నంత లాభాన్ని అందిస్తుంది. పైగా బాదం పప్పు సులభంగా జీర్ణం కాని వారు బాదంపాలను తయారు చేసుకుని తాగవచ్చు. దీని వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
బాదంపాలను చాలా సులభంగా తయారు చేయవచ్చు. బాదంపప్పును కనీసం 10 నుంచి 12 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. లేదా రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఒక కప్పు బాదంపప్పును అలా నానబెట్టిన తరువాత వాటిని పొట్టు తీసి మిక్సీలో వేసి కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా పట్టుకోవాలి. దీంతో బాదంపాలు రెడీ అవుతాయి. ఇలా ఒక కప్పు బాదంపప్పులతో సుమారుగా 5 కప్పుల మేర బాదంపాలను తయారు చేయవచ్చు. ఈ పాలను నిల్వ చేసి రోజూ 100 ఎంఎల్ మోతాదులో అయిపోయే వరకు తాగవచ్చు. ఈ విధంగా చాలా సులభంగా బాదంపాలను తయారు చేసి తాగవచ్చు. అయితే మార్కెట్లో మనకు బాదంపాలు లభిస్తాయి. వాటిని తాగవచ్చు కదా అని చాలా మందికి సందేహం వస్తుంది. కానీ ఆ పాలలో బాదంపప్పుల శాతం చాలా స్వల్పంగా ఉంటుంది. పైగా చక్కెర, ఇతర కృత్రిమ పదార్థాలను అందులో కలుపుతారు. కనుక ఆ పాలు శ్రేయస్కరం కాదు. బాదంపాలను ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
బాదంపాలను తాగడం వల్ల క్యాలరీలు చాలా స్వల్పంగా లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి కనుక ఈ పాలను తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారు కచ్చితంగా రోజూ బాదంపాలను తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం లభిస్తుంది. అలాగే ఈ పాలను తాగడం వల్ల క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తుంది. ఈ పాలలో ఉండే మెగ్నిషియం కండరాలకు మేలు చేస్తుంది. కండరాల నొప్పులను తగ్గించి కండరాలు ప్రశాంతంగా మారేలా చేస్తుంది. ఈ పాలలో మాంగనీస్, విటమిన్ కె, ఇ, ప్రోటీన్లు, జింక్, కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి సహాయం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లను తగ్గేలా చేస్తాయి.
బాదంపాలను తాగడం వల్ల శిరోజాలకు ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. సాధారణ పాలు కొందరికి అలర్జీలను కలిగిస్తాయి. పాలను తాగలేకపోతారు. అలాగే సాధారణ పాలు కొందరికి జీర్ణం కావు. దీని వల్ల అలాంటి వారు కూడా పాలను తాగలేకపోతుంటారు. కానీ అలాంటి వారందరూ బాదంపాలను తాగవచ్చు. ఇవి అలర్జీలను కలిగించవు. పైగా సులభంగా జీర్ణం అవుతాయి. దీంతోపాటు అనేక పోషకాలను అందిస్తాయి. కనుక పాలు అంటే అలర్జీ ఉన్నవారు బాదంపాలను తాగవచ్చు. ఇక బాదంపాలను తాగడం వల్ల విటమిన్ డి అధిక మొత్తంలో లభిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారు రోజూ ఈ పాలను తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. బాదం పాలను తాగడం వల్ల అందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా బాదంపాలను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.