చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతుంది. దీనికి తోడు శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఇప్పటికే ఈ సమస్యలు ఉన్నవారికి చలికాలం మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. అందువల్ల ఈ సీజన్లో ఎవరైనా సరే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు పలు హెర్బల్ డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. అందరూ తులసి మొక్కను రోజూ పూజిస్తారు. అయితే తులసి ఆకులతో టీ తయారు చేసి తాగితే శరీరం మొత్తం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. అంతేకాదు, ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. 7 లేదా 8 తులసి ఆకులను ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. తరువాత అందులో కాస్త మిరియాల పొడి, తేనె వేసి కలిపి తాగాలి. ఇలా తులసి టీని తాగుతుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
అల్లం, పసుపు టీ వల్ల కూడా ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. నీళ్లు కాసిన్ని తీసుకుని అందులో కాస్త అల్లం, అర టీస్పూన్ పసుపు కలిపి మరిగించాలి. అనంతరం నిమ్మరసం, తేనె కలపాలి. దీన్ని భోజనం చేసిన అనంతరం తాగాలి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. నీళ్లను తీసుకుని అందులో తిప్పతీగ కాడలను వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని ఉదయం పరగడుపున తాగితే మంచిది. దీంతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
ఉసిరికాయలను సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు. ఇవి కేవలం మనకు చలికాలంలోనే లభిస్తాయి. కనుక వీటిని సులభంగా తీసుకోవచ్చు. 30 ఎంఎల్ ఉసిరికాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి అందులో కాస్త తేనె వేసి కలిపి ఈ డ్రింక్‌ను ఉదయం పరగడుపునే తాగుతుండాలి. ఇలా చేస్తున్నా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. నీటిలో ఒక దాల్చిన చెక్క ముక్కను వేసి బాగా మరిగించాలి. అనంతరం అందులో కాస్త తేనె కలపాలి. ఈ డ్రింక్‌ను సాయంత్రం పూట తాగితే మంచిది. దీంతో శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
నీటిలో ఒక చిన్న అతిమధురం వేరు ముక్కను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత వడకట్టి అందులో తేనె కలిపి తాగేయాలి. దీని వల్ల గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి నిద్రకు ముందు ఈ డ్రింక్‌ను తాగితే మంచిది. దీంతో గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. తులసి ఆకులు, పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి అనంతరం అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇలా పలు రకాల హెర్బల్ డ్రింక్‌లను సేవించడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.