మనం తీసుకునే ఆహారాల్లోగానీ, ఔషధాల్లో గానీ ఉండే విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరగకుండా కాలేయం కాపాడుతుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం దగ్గర్నుంచి.. కొవ్వు, చక్కెర, ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, రక్తశుద్ధి చేయడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికి, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం.. ఇలా ఎన్నో కీలకమైన బాధ్యతలను కాలేయం నిర్వహిస్తుంది. ఇంతటి కీలకమైన అవయవం దెబ్బతింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. వీటిలో ముఖ్యమైనది హెపటైటిస్. ఏ, బీ, సీ లుగా కనిపించే ఈ వ్యాధి తీవ్రత సిర్రోలిక్ దశకు చేరుకుంటే.. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఈ దశలో కాలేయ మార్పిడి మినహా మరెలాంటి చికిత్స ఉండదని గుర్తుంచుకోవాలి. హెపటైటిస్-బీ వ్యాధి అవగాహన దినం సందర్భంగా ఈ వ్యాధికి సంబంధించి కొన్ని విషయాలు పాఠకుల అవగాహన కోసం…
వ్యాప్తి ఇలా..
ఈ వ్యాధి కారణంగా కాలేయం పూర్తిగా చెడిపోవడం, నాశనమవడం, లివర్ క్యాన్సర్‌కు దారితీయడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇన్ఫెక్షన్కు గురైన రక్తాన్ని మరొక వ్యక్తికి ఎక్కించడం వలన హెపటైటిస్ బీ వ్యాప్తిచెందుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ మందితో సెక్స్ చేయడం ద్వారా, డ్రగ్స్ వాడే వారిలో హెపటైటిస్-బీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా అధ్యయనాలు వెల్లడించాయి. రక్తమార్పిడి ద్వారా, సిరంజీలు, సూదుల ద్వారా తల్లుల నుంచి శిశువులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ సోకిన సూదులను ఇతరులకు వాడటం ద్వారా కూడా వ్యాప్తిచెందుతుంది.
అయితే, ఈ వ్యాధి ముద్దులు పెట్టుకోవడం ద్వారా, ఇతరులను పట్టుకోవడం ద్వారాగానీ, ఆహారం, తాగునీరు ద్వారా, పాత్రలు వాడుకోవడం, దగ్గు, జలుబు ద్వారా గానీ వ్యాపించదు.
లక్షణాలు ఇవీ..
హెపటైటిస్ బీ, సీ వ్యాధి సోకినవారిలో కొన్ని సంవత్సరాలపాటు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఒకసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిందంటే.. దాని సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ లివర్‌ను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. రక్తం, వీర్యం, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరక స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్ కనిపించే అవకాశాలు ఉంటాయి. స్వల్పకాలిక హెపటైటిస్-బీ ఇన్ఫెక్షన్ ఎలాంటి లక్షణాలకు చూపదు. ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న వారిలో కూడా లక్షణాలు కనిపించవు.
హెపటైటిస్-బీ వ్యాధికి గురైన వారిలో కాలేయానికి వాపు వస్తుంది. వాంతులు విపరీతంగా అవుతుంటాయి. కండ్లు పసుపురంగులోకి మారుతాయి.
విపరీతమైన జ్వరం వస్తుంది.
వారాలు, నెలలపాటు కొనసాగే అలసట ఉంటుంది.
ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు అవుతుంటాయి.
బొడ్డు ప్రాంతంలో నొప్పి కనిపిస్తుంది.
కీళ్ల నొప్పులు కూడా హెపటైటిస్-బీ లక్షణంగా ఉంటుందని గుర్తించుకోవాలి.
నిర్ధారణ ఇలా..
వైరస్ వ్యాపించిన తర్వాత 1 నుంచి 6 నెలల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అలాంటి లక్షణాలు ఉన్నట్లుగా ఏమీ అనిపించకపోవచ్చు. రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధి సోకినట్లు గుర్తించవచ్చు. న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షలు చేయడం ద్వారా, లివర్ బయాప్సీ ద్వారా, పారా సెంటెసిస్, ఎలాస్టోగ్రఫీ, సర్కోగేట్ మార్కర్స్ ద్వారా ఈ వ్యాధిని నిర్ధారణ చేస్తుంటారు.
ముందు జాగ్రత్తలు..
భార్యతో కాకుండా ఇతరులతో సెక్స్‌లో పాల్గొనకుండా చూసుకోవాలి.
వైరస్ సోకిన వ్యక్తుల నెయిల్‌కట్టర్లు వాడరాదు.
డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడాలి.
చెవులు కుట్టడం, ముక్కు కుట్టడం, పచ్చబొట్టు వేయించుకునే సమయాల్లో ఇతరులకు వాడిన పరికరాలను వాడకుండా చూసుకోవాలి.
రక్తం ఎక్కించుకునేప్పుడు, రక్తమార్పిడి సమయాల్లో సురక్షిత పద్ధతులను అనుసరించాలి.
ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తులు వాడిన రేజర్లు, బ్రష్‌లు, నీడిల్స్ ఇతరులు వినియోగించకుండా చూడాలి.
హెపటైటిస్-బీ కోసం ఎంగెరిక్స్-బీ, రీకాంబివాక్స్ హెచ్‌బీ టీకాలను తీసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా తప్పకుండా టీకా ఇప్పించాలి.
గర్భిణీలు HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్-బీ ఉన్నాకూడా బిడ్డను కనొచ్చు.