మాతృత్వ మాధుర్యాన్ని కోరుకునే స్త్రీలకు హీట్‌వేవ్ (వడగాలి) ఉపద్రవంలా మారింది. వీపరీతమైన ఎండ మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, వేడి వాతావరణం, వడగాలుల కారణంగా మానసికంగా, శారీరకంగా స్త్రీలలో ఒత్తిడి పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
అధిక ఉష్టోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల కార్టిసాల్ వంటి ఒత్తిడిని పెంచే హర్మోన్ల ఉత్పత్తి
పెరగడం, స్త్రీలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హర్మోన్లపై ప్రభావం చూపుతున్నట్టు పేర్కొంటున్నారు. ఈ హర్మోన్ల అసమతుల్యత కారణంగా రుతుక్రమ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు చెప్పారు. దీని ప్రభావం అండాల విడుదల (ఓవులేషన్)పై పడుతున్నదని.. ఈ రెండు అంశాలు గర్భధారణకు సవాలుగా మారుతున్నట్టు వెల్లడించారు. వేసవిలో జరిగే ఈ మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటే ఇంబాలెన్సెస్ (అసమానతల)ను గుర్తించవచ్చని వైద్యులు అంటున్నారు.
వేసవిలో శరీరం నుంచి చెమట ద్వారా ఎక్కువ ఫ్లూయిడ్స్‌ను కోల్పోతారు. కాబట్టి, ఎప్పటికప్పుడు శరీరానికి అవసరమైన ద్రవ పదార్థాలను తగిన మొత్తంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. వీర్యం అండాన్ని చేరడానికి సహాయపడే గర్భాశయ శ్లేష్మం హైడ్రేషన్పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. శ్లేష్మం తక్కువగా ఉన్నా.. లేదా మందంగా ఉన్నా.. అది వీర్యం కదలికకు ఆటంకం కలిగిస్తుందని తెలిపారు. గర్భధారణ కోరుకునే మహిళలు వడగాలుల సమయంలో ప్రతీరోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగడం ద్వారా సంతాన సామర్థ్యం పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
నిద్ర, పౌష్టికాహారం
పునరుత్పత్తికి దోహదపడే హర్మోన్లను నియంత్రించే ప్రక్రియలో నిద్ర కీలక పాత్ర వహిస్తుంది. అయితే, వేసవిలో స్త్రీలకు తగినంత నిద్రపట్టడం కష్టంగా మారుతుంది. నిద్రలేమి కారణంగా మెలటోనిన్ అనే హార్మోన్ స్థాయి తగ్గి అది అండాల విడుదలపై ప్రభావితం చూపుతుందని వైద్యులు తెలిపారు. అందుకే నిద్రపోయేటప్పుడు యూవీ కిరణాలు, సూర్యకాంతి, వేడిని నిరోధించే బ్లాక్ అవుట్ కర్టెన్లు, కాటన్ బెడ్షీట్లతోపాటు గది చల్లగా ఉండేలా చూసుకోవాలి.
సంతానోత్పత్తికి కంటినిండా నిద్ర కీలకమని సూచిస్తున్నారు. వేసవిలో ప్రయాణాలు కూడా కొన్నిసార్లు రుతుచక్రాన్ని దెబ్బతీస్తాయని.. ప్రయాణాలతో కలిగే ఒత్తిడి కూడా అండాల విడుదలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడగాలుల సమయంలో వేడి కారణంగా ఆకలి తగ్గుతుంది. దీంతో కొన్నిసార్లు తక్కువ పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. సంతానోత్పత్తి పౌష్టికాహారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, స్త్రీలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఆరోగ్యకరమైన అండాల అభివృద్ధికి దోహదపడతాయి. అందువల్ల, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. హైడ్రేటింగ్ సమస్యలను తప్పించుకోవడానికి కొబ్బరినీళ్లు క్రమం తప్పకుండా తాగాలి. వేసవిలో ఎండవేడి మానసిక ఆరోగ్యంపై సైతం ప్రభావితం చూపుతుంది.
గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న స్త్రీలు అప్పటికే భావోద్వేగ ఒత్తిడికి లోనవుతారు. అదనంగా వేసవి కారణంగా ఈ ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇలాంటప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఎండలో బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ లోషన్లు తప్పనిసరిగా వాడాలని, హైడ్రేటెట్‌గా ఉండాలని సూచించారు.