మనిషి శరీరంలో అన్నీ ప్రధాన అవయవాలే! అయితే గుండె తర్వాతే మరేదైనా అనిపిస్తుంది. లయ తప్పకుండా కొట్టుకుంటూ మనిషి ప్రాణాన్ని నిరంతరం కాపాడేది గుండెకాయే! అయితే, హృదయం చుట్టూ ఎన్నో అపోహలు ఉన్నాయి. హృద్రోగానికి సంబంధించి ఎన్నో అభిప్రాయాలు మనలో పేరుకుపోయాయి. గుండె జబ్బు ముప్పు ఎవరికి, ఎంత వరకు ఉంటుందో తెలుసుకుంటే.. కాస్త గుండె దిటువు చేసుకోవచ్చు.
గుండె వేగంగా కొట్టుకోవడంగుండెపోటుకు సూచనా?
కాదు! వ్యాయామం, ఇతర కఠినమైన శారీరక శ్రమ చేస్తున్న సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకోవడం సహజమే.
మాంసాహారులకు హృద్రోగాల ముప్పు ఎక్కువా?
హృద్రోగాలను నియంత్రించడంలో మంచి ఆహారానిది ప్రధాన పాత్ర. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే గుండె వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చు. మొత్తానికి మంచి జీవనశైలితో సంపూర్ణమైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే, అది ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతమా?
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంటే, అది గుండెకు సంబంధించిన, గుండెకు సంబంధించని వ్యాధులకు సంకేతం. వీటిలో సీఓపీడీ, న్యుమోనియా, ఎనీమియా, ఆందోళన, గుండె లయలో తేడాలు (ఎట్రియల్ ఫైబ్రిలేషన్) లాంటివి ఉంటాయి. కానీ అత్యంత సాధారణమైంది మాత్రం గుండెపోటు.
గుండెపోటు గురించి తెలుసుకోవడానికి ఏకైక మార్గం ఛాతీలో నొప్పి రావడమేనా?
సినిమాల్లో చూసినట్లు ఛాతీనొప్పి అన్నివేళలా గుండెపోటుకు దారితీయదు. ఛాతీలో నొప్పితోపాటు బలహీనంగా ఉండటం, తలలో తేలికగా అనిపించడం, లేదంటే మూర్ఛ వచ్చినట్లుగా ఉండటం గుండెపోటు లక్షణాలు. ఇంకా చల్లటి చెమటలు పట్టడం, నొప్పిగా అనిపించడం, దవడల్లో ఇబ్బందిగా ఉండటం, మెడ లేదా వెన్నులో నొప్పి, ఒకటి లేదా రెండు చేతులూ, భుజాల్లో ఇబ్బందిగా ఉండటం, శ్వాస తక్కువ కాలం కొనసాగడం కూడా గుండెపోటుకు సంకేతాలు.
బలమైన శరీరం… బలమైన గుండె నిజమేనా?
భారీ కండరాలు ఉన్నవాళ్లను చూసి ఫిట్‌గా ఉన్నారని అనుకోవడం సహజం. ఇది అన్నిసార్లూ నిజం కాదు. పైపెచ్చు కండరాల నిర్మాణం కోసం శరీరానికి సరిపడని సప్లిమెంట్లను తీసుకుంటే కనుక, గుండెపోటు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లే.
ఆటల్లో ఉన్నవారికి గుండెపోటు రాదా?
షేన్‌వార్న్ లాంటి ఆటగాళ్లు, సిద్ధార్థ శుక్లా లాంటి ఫిట్ సెలెబ్రిటీలు, గాయకుడు కేకే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కాబట్టి, ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకుంటేనే మంచిది.
గుండె మీద నిద్ర ప్రభావం చూపించదా?
ఆటంకాలు ఎక్కువగా ఉన్న నిద్ర, గురక ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. దాంతో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
గుండెపోటు ముప్పు పట్టణవాసులకు ఎక్కువగా ఉంటుందా?
ఇది చాలా మందిలో నెలకొన్న అపోహ. చాలా అధ్యయనాల్లో కూడా గత కొన్నేళ్లుగా గుండెపోటు ముప్పు ఇంతలంతలైనట్లు తేలింది. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణం. జీవితంలో ఎదురయ్యే వాస్తవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే, ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి, వాస్తవాలను తెలుసుకుంటే ఎప్పటికీ మంచిది.
-డాక్టర్ నవీన్ భామ్రిడైరెక్టర్, హెచ్ఓడీ
ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,శాలిమార్ బాగ్, ఢిల్లీ