Heart Attack | చేర్యాల, ఫిబ్రవరి 28: మీరు ఫిట్‌గా ఉన్నారా..? ప్రతిరోజు జిమ్ చేస్తున్నారా…? అయితే మీకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం లేదని అనుకుంటే పొరపాటే! అదే ధీమాతో ఎక్కువ కసరత్తు చేసేవారు అధికంగా గుండెపోటుకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యుక్త వయస్సులో వ్యాయామం చేయడం ద్వారా యువత అధికంగా మృత్యువాత పడుతున్నారని వైద్యులు, ట్రైనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌గా ఉన్నప్పటికీ నాలుగు పదుల వయసు దాటాక అధికంగా జిమ్ చేయడంతో గుండె అధిక ఒత్తిడికి గురై గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హృదయం ఇచ్చే సూచనలు తప్పనిసరి పాటించాలని సూచిస్తున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ఔట్స్ చేయడం గుండెపోటుకు కారణమని నిపుణులు అంటున్నారు. కన్నడ సినీ హీరో పునీత్‌తోపాటు ఏపీ మంత్రి మేకపాటి గౌతం తదితరులు వర్క్ ఔట్స్ చేస్తూ హఠాన్మరణం పొందిన నేపథ్యంలో కసరత్తు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిమ్ చేసే సమయంలో ట్రైనర్ సూచనలు తప్పక పాటిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. 40 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతిరోజు జిమ్, వ్యాయామం చేయాలి. అయితే ట్రైనర్ సూచనలతో ముందుకు సాగితే ఇబ్బందులు రావని వైద్యులు చెబుతున్నారు.
దినచర్యలో ఎక్సర్సైజ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి వ్యక్తి 45 నిమిషాల పాటు వారంలో ఐదు రోజులు వ్యాయామం, నడకలో పాల్గొనాలి. అధికంగా జిమ్ చేస్తే గుండెపోటు రావచ్చని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ అది జన్యుపరంగా వస్తున్నట్లు ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. అధిక జిమ్ చేసే వారిలో పరీక్షలు చేసుకోకపోవడం, రక్తనాళాలు అప్పటికే మూసుకుపోయి ఉంటే జిమ్ చేసే సమయంలో గుండె వేగంగా కొట్టుకొని రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. జిమ్ వ్యాయామాలు చేసే సమయంలో అలసటగా, గుండె బరువుగా, కళ్లు తిరిగినట్లు అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి.
తక్కువ సమయంలో ఫలితాలు ఆశించడంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. సిక్స్‌ప్యాక్ రావడాని కనిష్టంగా సంవత్సర కాలం పడుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసేవారు సినిమా షూటింగ్‌ల కోసం తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ఔట్స్ చేస్తుంటారు. కొందరు యువకులు సైతం నిత్యం ఎక్కువ శాతం వర్క్ఔట్స్ చేయడంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
జిమ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా గుండెకు సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. గుండెపోటుకు వయస్సుతో సంబం ధం లేదు. ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు వారికి కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. జిమ్‌కు వెళ్లే ముందుకు ఈసీజీ, టుడీఈకో, స్ట్రెస్ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. జిమ్ అధికంగా చేయడం తో డిస్క్, మెడ సమస్యలు అధికంగా వస్తుంటాయి. జిమ్ చేయడానికి ముందు వామ్అప్ చేయాలి. హైపర్ట్రోఫిక్ కార్డియోమపతి, ఎరిథామియాడిస్ తదితర గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు జిమ్‌కు దూరంగా ఉండాలి. స్థిరాయిడ్స్, ఆల్కహాల్, సిగరెట్ తీసుకోవడంతో డీహైడ్రేషన్‌తో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
– డాక్టర్ ఆర్.రాహుల్‌రెడ్డి, ఎండీ (జనరల్ సర్జన్)