Heart Attack At Night | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. ప్రపంచంలో అధిక శాతం దేశాల్లో గుండె జబ్బుల కారణంగా చాలా మంది ప్రతి ఏటా మృతి చెందుతున్నారు. గుండె జబ్బులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండడం, పొగ తాగడం, మద్యం సేవించడం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, ఆలస్యంగా నిద్రించడం వంటి అనేక కారణాల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గుండె జబ్బులు అధికంగా వచ్చేవి. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం వరకు గుండె జబ్బులు ఒత్తిడి, ఆందోళన లేదా పొగ తాగడం, మద్యం సేవించడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇక గుండె జబ్బుల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో అధికంగా వస్తుంది మాత్రం హార్ట్ ఎటాక్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా రాత్రి పూట సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 6 గంటల లోపు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. అయితే ఎక్కువ శాతం మందికి ఈ సమయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది..? అనే విషయాన్ని కూడా పరిశోధకులు అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు. సాధారణంగా రాత్రి 2 గంటలు దాటిన తరువాత కొందరికి నిద్రలో ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. అలాగే రక్త సరఫరా కూడా సరిగ్గా జరగదు. దీంతో గుండెపై భారం పడుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది. ఎక్కువ శాతం హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు ఇదే కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. రాత్రి పూట ఎవరికైనా అనుకోకుండా ఎలాంటి జలుబు లేకపోయినా దగ్గు వస్తుందంటే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది. కొందరికి ఛాతిపై బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. దీన్ని రాబోయే హార్ట్ ఎటాక్ కు సూచనగా భావించాలి. అలాగే రాత్రి పూట నిద్రించినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించినా, ఒళ్లంతా విపరీతంగా చెమటలు పడుతున్నా, తల తిరగడం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపించినా అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. అలాగే హార్ట్ ఎటాక్ సంభవించడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు కొందరికి కంటి రెప్పలపై కురుపులు కూడా వస్తాయి. కొందరికి పాదాలు, చేతులు వాపులకు గురై కనిపిస్తాయి. వీటన్నింటినీ హార్ట్ ఎటాక్‌కు సూచనలుగా భావించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
హార్ట్ ఎటాక్ వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేస్తుండాలి. ఆహారంలో ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. వారంలో కనీసం 5 రకాల పండ్లను తినాలి. పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లను మానేయాలి. రాత్రి పూట త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రించాలి. అతిగా ఆహారం తినకూడదు. కొవ్వు పదార్థాలు, నూనె ఆహారాలు, జంక్ ఫుడ్‌ను అధికంగా తినడం తగ్గించాలి. రోజూ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. తాజా కూరగాయలను తినాలి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల చాలా వరకు హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా జీవిస్తారు.