గురక చిన్నగానే మొదలవుతుంది. నిమిషాలు గడిచే కొద్దీ శబ్దం భరించలేని స్థాయికి చేరుకుంటుంది. రకరకాల అరుపులతో పక్కన పడుకున్నవారికి నరకమే. ఒకట్రెండు రోజులైతే ఫర్వాలేదు… కానీ, ఇది ఓ జీవితకాల రుగ్మత. కాకపోతే, చాలామంది దీన్ని ఓ సమస్యగా పరిగణించరు. తేలిగ్గా తీసుకుంటారు. పైగా బాగా గుర్రుపెట్టి నిద్రపోతే గాఢనిద్రగా పొరబడుతుంటారు. అంతేతప్ప వైద్యులను సంప్రదించరు. అవసరమైన చికిత్స తీసుకోరు. ఇకపోతే గురక సమస్యను వైద్య పరిభాషలో ‘స్లీప్ ఆప్నియా’ అని పిలుస్తారు. దీన్ని పట్టించుకోకుండా అలానే నిర్లక్ష్యం చేస్తే శరీరం రోగాల పుట్ట అవుతుంది. మానసిక రుగ్మతలకూ దారితీస్తుంది. ఓ దశలో ప్రాణాంతకం కూడా!
నిజం చెప్పాలంటే ‘గురక’ ఓ శబ్ద పిశాచం. నిద్రపోతున్నప్పుడు ఒకలా వేధిస్తే, మేల్కొన్నప్పుడు మరోలా బాధిస్తుంది. రాత్రిపూట గురకవల్ల గాఢనిద్ర దాదాపు అసాధ్యం. పరిపూర్ణమైన విశ్రాంతి అన్నదే లభించదు. ఇట్టే తెల్లవారిపోయినట్టు అనిపిస్తుంది. అయిష్టంగా మంచం దిగుతాం. ఆ నిస్సత్తువ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఇవన్నీ ‘స్లీప్ ఆప్నియా’ లక్షణాలు. తేలిగ్గా తీసుకుంటారు కానీ, ఇది చాలా తీవ్రమైన రుగ్మత. తరచూ శ్వాస ఆగి ఆగి కొనసాగుతూ ఇబ్బంది పెడుతుంది. నిద్రిస్తున్నప్పుడు పై వాయునాళం (అప్పర్ ఎయిర్ వే) పదేపదే ఒత్తిడికి గురికావడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణుల అభిప్రాయం. అయితే, స్లీప్ ఆప్నియాను ఎవ్వరూ కూడా ఒక జబ్బుగా గుర్తించడం లేదు. చికిత్స కోసం వైద్యుల దగ్గరికి వెళ్లడం లేదు. పెద్దల్లో 15 నుంచి 30 శాతం మందికి ఈ సమస్య ఉంటుందని అంచనా.
స్లీప్ ఆప్నియాకు చికిత్స తీసుకోకపోతే ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పొద్దంతా మగతగా ఉంటుంది. దీంతో రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరు. దీంతో వర్తమానంలో చేసే పనిలో, భవిష్యత్తులో పదోన్నతుల్లో వెనకబడిపోతారు. కెరీర్లో ఒడుదొడుకులు సంభవిస్తాయి. వ్యాపారులైతే కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించలేరు. ఫలితంగా దీర్ఘకాలంలో నష్టాలపాలయ్యే అవకాశం ఉంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇవన్నీ గురక వల్ల కలిగే సామాజిక, మానసిక ఇబ్బందులు. ఇక శరీర వ్యవస్థ విషయానికొస్తే జీవక్రియ మందగిస్తుంది.
కాలక్రమంలో గుండె కవాటాలు, మెదడు కవాటాల వ్యాధులు ఇబ్బంది పెడతాయి. న్యూరోసైకియాట్రిక్ డిస్ఫంక్షన్, పల్మనరీ హైపర్టెన్షన్, టైప్-2 మధుమేహం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మొదలైన వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి, స్లీప్ ఆప్నియాను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవాలి. వృద్ధాప్యం, ఊబకాయం ఈ సమస్యకు మూల కారణాలు. ముక్కుదిబ్బడ, ఒబేసిటి హైపోవెంటిలేషన్ సిండ్రోమ్, కిడ్నీ వ్యాధులు, గుండె రుగ్మతలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్ మెలిటస్ లాంటివి కూడా స్లీప్ ఆప్నియాకు దారితీస్తాయి.
పాలిసోమ్నోగ్రఫీ (పీఎస్)తో స్లీప్ ఆప్నియా నిర్ధారణ చేస్తారు. నిద్రలో శ్వాస సమస్యలను బట్టి స్లీప్ ఆప్నియా తీవ్రతను బేరీజు వేస్తారు. ఆప్నియా, హైపాప్నియా, రెరా (రెస్పిరేటరీ ఎఫర్ట్ రిలేటెడ్ అరౌజల్స్) ఉన్నాయేమో కూడా పరీక్షిస్తారు. సమస్య దశను బట్టి చికిత్స మొదలవుతుంది. బరువు తగ్గడం, రోజూ వ్యాయామం చేయడం, నిద్ర విధానంలో మార్పులు, మద్యపానం, డ్రగ్స్ తదితర దురలవాట్లను దూరంపెట్టడం.. సమస్యను అధిగమించడంలో కొంతమేరకు సాయపడతాయి. రోగ లక్షణాలను బట్టి వైద్యులు మందులను సిఫారసు చేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో పై వాయు నాళానికి శస్త్రచికిత్స చేస్తారు. హాయిగా నిద్ర పోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే ఏకైక మార్గం.
కొన్ని రకాలైన విటమిన్లు, మినరల్స్ లోపం వల్ల కూడా నిద్ర సంబంధమైన సమస్యలు వస్తాయి. కాబట్టి, గురక సమస్య నివారణలో ఆరోగ్యకరమైన పోషకాహారం కూడా కీలకపాత్రనే పోషిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని విటమిన్లు దోహదపడతాయి.
విటమిన్ డి: నిద్రలేమి, కలతనిద్ర, హఠాత్తుగా మెలకువ రావడం.. తదితర సమస్యలకు విటమిన్ డి లోపం ఓ కారణంగా చెబుతారు. నిద్ర, మెలకువకు సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షించడానికి మెదడులో ఓ ప్రత్యేకమైన విభాగం ఉంది. విటమిన్ డి ద్వారా దానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కాబట్టి, శరీరంలో విటమిన్ డి కొరత అధికమైన కొద్దీ నిద్రతో ముడిపడిన సమస్యలు పెరుగుతాయి. సాల్మన్ చేపలు, గుడ్డు సొన, చీజ్, పుట్టగొడుగులు, సముద్ర ఆహారంతో విటమిన్ డి సమకూర్చుకోవచ్చు.
విటమిన్ ఎ: నిద్రలేమికి, విటమిన్ ఎకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. కాబట్టి క్యారెట్, ఆప్రికాట్, టమాట తదితర కూరగాయలు, తాజా పండ్లు తింటూ విటమిన్ ఎ లోటు పూడ్చుకోవాలి.
విటమిన్-బి12: నిద్రలేమి, నిస్సత్తువ విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్న రోగులలో కనిపించే ప్రధాన లక్షణాలు. ఈ విటమిన్ లోపం వల్ల కుంగుబాటు తలెత్తే ముప్పు కూడా ఉంది. కుంగుబాటు ప్రధాన లక్షణాల్లో నిద్రలేమి ఒకటి. మాంసాహారం, గుడ్లు, తక్కువ కొవ్వు కలిగిన పాలు, తృణధాన్యాలు విటమిన్ బి12ను తగినంతగా అందిస్తాయి.
విటమిన్ బి9, విటమిన్ ఇ, విటమిన్ సి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిద్రతో ముడిపడి ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లలో లభించే ఫోలిక్ యాసిడ్ లోపం నిద్రలేమికి దారితీయవచ్చు. విటమిన్ ఇ లోపం రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసి అంతిమంగా నిద్రను ప్రభావితం చేస్తుంది. విటమిన్ సి పుష్కలంగా లభించేవారికి నిద్రలేమి సమస్యే ఉండదు. మెగ్నీషియం కూడా కండరాలకు విశ్రాంతిని ఇచ్చి నిద్రాదేవతకు ఆహ్వానం పలుకుతుంది. కొంతమంది రాత్రిళ్లు వ్యాయామం, సుదీర్ఘమైన నడక లాంటివి చేస్తుంటారు. ఇలా చేయకపోవడమే మంచిది. నాణ్యమైన నిద్రతోనే ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుంది. నిద్రలో సంతృప్తి లేనప్పుడు జీవితమూ అసంతృప్తికరమే. కాబట్టి, హాయిగా నిద్రించండి. ఆనందంగా జీవించండి.