Health Risks With Obesity | పూర్వకాలంలో చాలా మంది శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. అందుకనే అందరూ చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా మంది కూర్చుని పనిచేస్తున్నారు. అలాంటి ఉద్యోగాలనే ఎక్కువగా చేస్తున్నారు. శారీరక శ్రమ కూడా తగ్గుతోంది. దీనికి తోడు అస్తవ్యస్తమైన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా అధికంగా బరువు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1975 నుంచి అధిక బరువు లేదా స్థూలకాయం బారిన పడుతున్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని వెల్లడైంది. దీన్ని బట్టి చూస్తే స్థూలకాయం సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాప కింద నీరులా ఎలా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అధిక బరువు ఉన్నవారికి దీర్ఘకాలంలో అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధికంగా బరువు ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా ఉంటే అలాంటి వారికి గుండె సంబంధ సమస్యలు వస్తాయని అంటున్నారు. పొట్ట చుట్టూ అధికంగా పేరుకుపోయే కొవ్వు వల్ల బీపీ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతోపాటు రక్తనాళాలు వాపులకు గురవుతాయి. దీర్ఘకాలంలో ఇది హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ కు కారణమవుతుంది. అలాగే స్థూలకాయం ఉన్నవారికి దీర్ఘకాలలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయలేని విధంగా పెరిగిపోతాయి. దీంతో నరాలు డ్యామేజ్ అవడంతోపాటు కిడ్నీ వ్యాధులు వస్తాయి. కంటి చూపును కోల్పోతారు.
అధికంగా బరువు ఉంటే వయస్సు మీద పడే కొద్దీ కీళ్లు, మోకాళ్లు, తుంటి ఎముకలపై భారం అధికంగా పడుతుంది. దీర్ఘకాలంలో ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారి తీస్తుంది. దీంతో ఎముకలు తీవ్రంగా నొప్పి వస్తాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే కష్టంగా మారుతుంది. స్థూలకాయం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా బ్రెస్ట్, పెద్ద పేగు, కిడ్నీ, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శరీరంలో అధికంగా కొవ్వు ఉంటుంది కనుక వాపులకు గురవుతుంది. దీంతో క్యాన్సర్ వచ్చేందుకు సులభంగా అవకాశం ఉంటుంది.
అధికంగా బరువు ఉన్నా లేదా స్థూలకాయంతో బాధపడుతున్నా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. మద్యం విపరీతంగా సేవిస్తే వచ్చేది. మద్యం సేవించకపోయినా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కారణంగా వచ్చేది. బరువు ఎక్కువగా ఉంటే రెండో రకం ఫ్యాటీ లివర్ వస్తుందని అంటున్నారు. దీని వల్ల లివర్ లో కొవ్వు చేరి దీర్ఘకాలంలో లివర్ చెడిపోతుంది. దీంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే స్థూలకాయం శ్వాస సమస్యలను కూడా కలగజేస్తుంది. రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టదు. నిద్రపోయినా కూడా గురక తీవ్రంగా వస్తుంది. నిద్రలో తెలియకుండానే శ్వాస తీసుకోవడం కష్టంగా మారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు స్థూలకాయం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను కలగజేస్తుంది. కనుక అధికంగా బరువు ఉన్నవారు లేదా పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నవారు కొవ్వును కరిగించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పైన చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.