ఆస్తిపాస్తులు, హోదాలు తర్వాత. ముందు, ఆరోగ్యంగా ఉంటే చాలని ఎంతోమంది తపిస్తున్నారు. కానీ, ఆ వైపుగా చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. దీంతో ఆరోగ్యం క్షీణించి, రోగ నిరోధక వ్యవస్థ నెమ్మదిస్తున్నది. ఆరోగ్యకరమైన జీవితానికి కొన్ని అలవాట్లు..
నిద్రకు భంగం వద్దు
ఒక్కపూట నిద్ర సరిగా పట్టకపోతేనే, మరుసటి రోజు చిరాగ్గా ఉంటుంది. నిద్రలేమి వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. రోజూ కనీసం 6 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు వైద్యులు. లేకపోతే రోగ నిరోధక వ్యవస్థ, శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతాయి.
అధిక ప్రొటీన్ ఫుడ్ వద్దు
ప్రొటీన్ అధికంగా ఉండే మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. జున్ను, మాంసం వంటి హై ప్రొటీన్ ఫుడ్లోని ఐజీఎఫ్-1 అనే హార్మోన్ క్యాన్సర్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇలా తినడం ఓ రోజంతా ధూమపానం చేసినంత హానికరం. ప్రత్యామ్నాయంగా బీన్స్, ఆకుకూరలు ఎంచుకోవాలి.
ఎక్కువసేపు కూర్చోవద్దు
రోజంతా కుర్చీకే అతుక్కుపోవడం ప్రమాదకరం. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, గంటల తరబడి డ్రైవింగ్ చేయడం వల్ల.. ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ల బారినపడే ప్రమాదం ఉంది. ప్రతి గంటకు, రెండు గంటలకొకసారి కొంతసేపు అటూ ఇటూ తిరగాలి.
ఒంటరితనం వద్దు
కొందరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. ఎప్పుడూ ఏకాంతాన్నే కోరుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే ఆస్కారం ఎక్కువ. ఆందోళనలు, భావోద్వేగాలు, వ్యసనాలు.. ఈ మూడూ కలిస్తే వ్యాధులను శరీరంలోకి ఆహ్వానించినట్లే. ఆత్మీయుల సమక్షానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
వెలుతురును ఆహ్వానించండి
ఎండ, వెలుతురు లేని ప్రదేశాల్లో పని చేయడం, ఎక్కువసేపు గడపడం ఆరోగ్యానికి మంచిది కాదు. సూర్యరశ్మి తగలకుండా వ్యాయామం చేయడంవల్లనూ ఫలితం లేదు. దీనివల్ల చర్మ క్యాన్సర్
కబళించే ప్రమాదం లేకపోలేదు.