మిగిలినవారితో పోలిస్తే.. శారీరకంగా దృఢంగా ఉండే 12 13 ఏండ్ల పిల్లల్లో జాగరూకత, విషయ గ్రహణ పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంక్లిష్టమైన ఆలోచనా శక్తి ఎక్కువేనట. ఈ విషయాన్ని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. వ్యాయామ (ఫిజికల్ ఎడ్యుకేషన్) తరగతికి ముందు, ఆ తర్వాత పిల్లలపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
ఇంట్లో ప్రసరించే గాలి స్వచ్ఛంగా ఉంటేనే.. మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు, మెదడు సృజనాత్మకత కూడా పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇండ్లలో ఉపయోగించే డిటర్జెంట్లు, పురుగుమందులు, అత్తర్లు, గోడల రంగుల లాంటి వాటినుంచి వెలువడే వాయువులు మన సృజన మీద ప్రతికూల ప్రభావం చూపుతాయట. వాటి గాఢత తగ్గితే మన సృజనాత్మక శక్తి పెరుగు
తుందని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి, ఇంటిని ఎంపిక చేసుకుంటున్నప్పుడు ఈ విషయాన్నీ గమనంలో ఉంచుకోవాలి.
కాల పరిమితికి లోబడి తినడమే ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ ప్రత్యేకత. టైప్-2 డయాబెటిస్ రోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందట. ఈ పద్ధతిని పాటించడం వల్ల బరువు తగ్గడంతోపాటు, రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో పెట్టుకోగలరని చికాగోకు చెందిన ఇలినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది. క్యాలరీలు తీసుకోవడం 25 శాతం వరకు తగ్గించుకున్నవారితో పోలిస్తే, మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు నోరు కట్టేసుకున్న వాళ్లు 6 నెలల్లో ఎక్కువ బరువు తగ్గారట. సంప్రదాయమైన డైటింగ్ పాటించడం కంటే నిర్దిష్ట కాల పరిమితులతో భోజనం చేయడం మంచిదన్నది పరిశోధకుల మాట.
కొరియాకు చెందిన 50 వేల మంది కౌమార వయస్కులపై స్మార్ట్ఫోన్ దుష్ప్రభావాల గురించి ఒక సర్వే చేశారు. వీరిలో రోజుకు నాలుగు గంటలకుపైగా స్మార్ట్ఫోన్తో గడిపిన వాళ్లలో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్టు తేలింది. మరో విషయం ఏంటంటే… స్మార్ట్ఫోన్ అసలే వాడని పిల్లల కంటే, దాన్ని రోజుకు ఒకటిరెండు గంటలు వాడిన వాళ్లలో తక్కువ మానసిక సమస్యలు ఉన్నాయట. కౌమార బాలబాలికలు స్మార్ట్ఫోన్ ఎలా వాడాలనే విషయంలో ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయని అంటున్నారు పరిశోధకులు.