పిల్లలూ.. వ్యాయామంతో ఒత్తిడి పరార్!
రోజూ వ్యాయామం చేసే పిల్లలు ఒత్తిడితో మెరుగ్గా పోరాడుతారు. స్విట్జర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బేసెల్ పరిశోధన ఈ అంశాన్ని వెల్లడించింది. పిల్లల లాలాజలంలో ఉండే కార్టిసోల్ హార్మోన్ స్థాయులను పోల్చడం ద్వారా ఒత్తిడి సమయంలో వారు ఎలా స్పందిస్తున్నారనేది తెలుసుకున్నారు. రోజుకు ఒక గంటకు పైగా వ్యాయామం చేస్తూ, చురుగ్గా ఉన్న పిల్లల్లో కార్టిసోల్ తక్కువగా విడుదలైందట. మిగిలినవారిలో ఈ హార్మోన్ పరిమాణం ఎక్కువగా ఉందట. కార్టిసోల్ హార్మోన్ స్థాయులు పెరుగుతుంటే మెదడు ఏదో సానుకూలత కోసం వెతుక్కుంటుందట. అలా పరీక్షలప్పుడు, ఇతరత్రా ఒత్తిడి సన్నివేశాల్లో కార్టిసోల్ హార్మోన్ పేరుకుపోకుండా మెదడు అడ్డుకుంటుంది. కార్టిసోల్కు లొంగిపోకుండా ఉండటానికి వ్యాయామం ఓ మంచి మాధ్యమం అని తాజా పరిశోధన సూచన.
పొగాకుతో ఆందోళన, కుంగుబాటు
తాజా అధ్యయనం ప్రకారం పొగాకు, గంజాయి రెండూ వినియోగించేవారిలో ఆందోళన, కుంగుబాటు లాంటి మానసిక అనారోగ్య సమస్యల ముప్పు… వీటిలో ఏదో ఒకటి వినియోగించే వారితో పోలిస్తే ఎక్కువగానే ఉంటుందట. ఈ అధ్యయనం ప్లోస్ ఒన్ జర్నల్‌లో ప్రచురితమైంది. అదే ఈ రెండిటికీ పూర్తి దూరంగా ఉన్నవారిలో అయితే ఈ లక్షణాలు చాలా తక్కువగా కనిపించాయట. కాబట్టి పొగాకు, గంజాయికి అలవాటు పడినవాళ్లు ఈ మహమ్మారుల నుంచి బయటపడటానికి వారికి అన్ని విధాలా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం తెలిపింది.
వెల్లుల్లి దుర్వాసనకు గ్రీక్ యోగర్ట్‌తో చెక్
వెల్లుల్లి దట్టించిన ఆహారం తినడంతో తలెత్తే నోటి దుర్వాసనను తరిమి కొట్టాలనుకుంటున్నారా? అయితే, ఇలాంటి ఆహార పదార్థాలు తిన్న వెంటనే గ్రీక్ యోగర్ట్ తినాలట. పాల నుంచి తీసిన గ్రీక్ యోగర్ట్.. వెల్లుల్లి కారణంగా నోటినుంచి వెలువడే ఘాటైన వాసనలను దాదాపుగా పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. “వెల్లుల్లితో వచ్చే నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి యాపిల్ పండు తినమని సూచిస్తారు. అంతేకాదు వెల్లుల్లి తిన్న వెంటనే గ్రీక్ యోగర్ట్ తిన్నా అదే ప్రయోజనం ఉంటుంది” అని అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆచార్యులు షెరిల్ బారింజర్ సలహా ఇస్తారు. ఈ అధ్యయనాన్ని మాలిక్యుల్ జర్నల్ ప్రచురించింది.