Shilajit | ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు, ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ చాలా వరకు మూలికలు లేదా ఔషధాల గురించి మనకు ఇంకా తెలియదు. అవి ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా వాటి శక్తి గురించి మనకు అంతగా అవగాహన లేదు. అలాంటి ఔషధాల్లో శిలాజిత్ కూడా ఒకటి. దీన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని నేరుగా ఔషధంగా కూడా వాడుతారు. శిలాజిత్ అనేది చూసేందుకు నల్లని తారులాంటి పదార్థంలా కనిపిస్తుంది. కానీ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శిలాజిత్ ను పర్వత ప్రాంతాల నుంచి సేకరిస్తారు. అనంతరం శుద్ధి చేసి విక్రయిస్తారు. లేదా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. శిలాజిత్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని అనేక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారు.
శిలాజిత్ను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరంలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. అలసట, నీరసం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్గా పనిచేస్తారు. శిలాజిత్లో ఫుల్విక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతుంది. ఇది మెదడు కణాలను ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తుంది. దీని వల్ల మెదడు యాక్టివ్గా మారుతుంది. చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్యంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. శిలాజిత్ను తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయని సాక్షాత్తూ సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. దీని వల్ల వీర్యం వృద్ది చెంది శుక్ర కణాల నాణ్యత పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడుతాయి.
శిలాజిత్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. శిలాజిత్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల శిలాజిత్ను తీసుకుంటే శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులు తగ్గుతాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు. శిలాజిత్ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా విరిగిన ఎముకలు ఉన్నవారు దీన్ని తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అలాగే వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
శిలాజిత్ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో లేదా ఎక్కువ ఎత్తులో నివసించేవారు తరచూ ఆల్టిట్యూట్ సిక్ నెస్కు గురవుతుంటారు. దీని వల్ల తలనొప్పి, తల తిరగడం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. కానీ శిలాజిత్ను తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకనే శిలాజిత్ ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో మనకు లభిస్తుంది. ఇక శిలాజిత్ మనకు ఆయుర్వేద షాపుల్లో రెజిన్, పొడి, క్యాప్సూల్స్ రూపంలో లభిస్తుంది. దీన్ని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా క్యాప్సూల్స్ అయితే ఆరోగ్య స్థితిని బట్టి రోజుకు 200 నుంచి 500 ఎంజీ మోతాదులో ఇస్తారు. శిలాజిత్ను సాధారణంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత తీసుకోవాలి. అతి వేడి లేదా అతి చల్లని ద్రవాలతో దీన్ని తీసుకోకూడదు. ఐరన్ ట్యాబ్లెట్లను వాడేవారు, రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు, యూరిక్ యాసిడ్ లేదా గౌట్ సమస్య ఉన్నవారు, లోబీపీ ఉన్నా, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు శిలాజిత్ను వాడరాదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో శిలాజిత్ను వాడుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.