Prawns | నాన్ వెజ్ ప్రియులు వివిధ రకాల మాంసాహారాలను తింటుంటారు. వాటిల్లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యిలు మనకు అనేక రకాలుగా లభిస్తాయి. పచ్చి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. అద్భుతమైన ప్రయోజనాలను, పోషకాలను అందిస్తాయి. రొయ్యలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. రొయ్యలు మనకు అనేక లాభాలను అందిస్తాయి. రొయ్యల్లో హై క్వాలిటీ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. ఎంజైమ్‌లు, హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. రొయ్యల్లో అనేక విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి.
రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల నాడీ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మెడ, భుజాల్లో వచ్చే నొప్పి తగ్గుతుంది. రొయ్యల్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తుంది. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. రొయ్యల్లో ఉండే జింక్ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. కణాల నిర్మాణం జరుగుతుంది. రొయ్యల్లో ఉండే అయోడిన్ థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేస్తుంది. థైరాయిడ్ సమస్య నుంచి బయట పడేలా చేస్తుంది. శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉంటుంది.
రొయ్యల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది మినరల్ అయినప్పటికీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా కూడా పనిచేస్తుంది. ఇది కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. రొయ్యల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇది చాలా స్వల్ప మోతాదులో ఉంటుంది. అందువల్ల రొయ్యలను తింటే మన శరీరంలోని కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం పడదు. అయితే రొయ్యలను ఉడకబెట్టి లేదా కూర రూపంలో తినాలి. వేపుడు రూపంలో తినకూడదు. అలా తింటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇక రొయ్యల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. కనుక శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
రొయ్యల్లో ఆస్టాజాంతిన్ అనే ఓ ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కూరగాయల్లో లభించే బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కన్నా చాలా శక్తివంతమైంది. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. రొయ్యల్లో క్యాలరీలు చాలా తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇక రొయ్యలను 100 గ్రాముల మోతాదులో తింటే మనకు దాదాపుగా 100 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 24 గ్రాములు, కొవ్వులు 2 గ్రాములు, కొలెస్ట్రాల్ 200 మిల్లీగ్రాములు లభిస్తాయి. విటమిన్ బి12తోపాటు సెలీనియం, అయోడిన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలను పొందవచ్చు. ఇక రొయ్యలు ఆరోగ్యకరమే అయినప్పటికీ వీటిని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. వారానికి సుమారుగా 150 గ్రాముల వరకు రొయ్యలను తినవచ్చు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ వీటిని తింటే అనేక లాభాలను పొందవచ్చు.