Mutton Liver | ఆదివారం వస్తే చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఏ నాన్ వెజ్ వంటకాన్ని తిందామా.. అని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు చికెన్ తింటే కొందరు మటన్ తింటారు. ఇంకొందరు చేపలు, రొయ్యలను తింటారు. అయితే మటన్ విషయానికి వస్తే అందులో చాలా వెరైటీలు ఉంటాయి. వాటిల్లో మటన్ లివర్ కూడా ఒకటి. మటన్ లివర్‌ను చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. అయితే మటన్ లివర్ అనేక పోషకాలను కలిగి ఉంటుందని, దీన్ని పోషకాలకు గనిగా భావించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మటన్ లివర్‌ను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని తింటే అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు.
మటన్ లివర్‌లో పోషకాల శాతం అధికంగా ఉంటుంది. హై క్వాలిటీ ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. ఇవి కణజాల మరమ్మత్తులకు దోహదం చేస్తాయి. శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేలా చూస్తాయి. మటన్ లివర్‌లో మన శరీరానికి కావల్సిన అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. మటన్ లివర్‌లో ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. కనుక లివర్‌ను తింటే శరీరానికి ఐరన్ అధికంగా లభిస్తుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తం తక్కువగా ఉన్నవారు మటన్ లివర్‌ను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. మటన్ లివర్‌లో విటమిన్ ఎ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. కణాల వృద్ధికి, మరమ్మత్తులకు దోహదం చేస్తుంది.
మటన్ లివర్‌లో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి12, విటమిన్ బి9 అధికంగా ఉంటాయి. విటమిన్ బి12 నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మెడ, భుజాల భాగాల్లో వచ్చే నొప్పి తగ్గిపోతుంది. విటమిన్ బి12 వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. మటన్ లివర్‌లో ఉండే ఫోలేట్ కణజాల నిర్మాణానికి సహాయం చేస్తుంది. గర్భిణీలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. శిశువు ఎలాంటి పుట్టుక లోపాలు లేకుండా జన్మించేందుకు గాను సహాయ పడుతుంది. మటన్ లివర్‌లో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం శోషించుకునేలా చేస్తుంది. శరీరంలో శక్తి పెరిగేలా చేస్తుంది. నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మటన్ లివర్‌లో అధిక మొత్తంలో ఉండే పలు రకాల బి విటమిన్లు, ఐరన్, కోలిన్ కారణంగా లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా మారి ఉత్సాహంగా పనిచేస్తుంది. చురుగ్గా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళణ తగ్గతాయి. కోలిన్ వల్ల మెదడు అభివృద్ధి చెందుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఇక మటన్ లివర్ ఆరోగ్యకరమే అయినప్పటికీ దీన్ని గౌట్, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తినకూడదు. మటన్ లివర్‌ను తింటే వారంలో ఒకసారి మాత్రమే తినాల్సి ఉంటుంది. అది కూడా 100 గ్రాములకు మించి తినకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ మటన్ లివర్‌ను తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.