Seema Chinthakaya | విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడని అంటారు. అందులో సీమచింత లేదా పులిచింత కూడా ఒకటని చెబుతారు. ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తుంది. హిందీలో జంగిల్ జలేబీ, తమిళంలో కొడుక్క పులి, కన్నడంలో సిహీ హుణిసె అని పిలుస్తారు. పిథీసెలోబియం డల్సె అనే శాస్త్రీయనామం కలిగిన సీమచింత ముండ్లచెట్టుకు కాస్తుంది. మధ్య అమెరికా, మెక్సికో దేశాలకు స్థానికమైన సీమచింతను ఇంగ్లిష్‌లో మనీలా టామరిండ్, మద్రాస్ థార్న్, మంకీ పాడ్ అనే పేర్లతో పిలుస్తారు. భారతదేశంలో సీమచింత కాయలు ఏప్రిల్-జూన్ నెలల మధ్య దొరుకుతాయి. సలాడ్స్, పచ్చళ్లు, జామ్‌ల రూపంలో వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎండాకాలం చల్లటి పానీయాల్లోనూ కలుపుకోవచ్చు. సీమచింత ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఇది ఫైబర్‌కు మంచి వనరు. విటమిన్- సి, ఎ, పొటాషియం, ఐరన్ లాంటి అనేకానేక విటమిన్లు, మినరల్స్ ఇందులో ఉన్నాయి.
అయితే కిడ్నీ రోగులు మాత్రం ఆమడ దూరంలో ఉండాలి. ఇది మూత్రపిండ సమస్యలను తీవ్రం చేస్తుంది. సీమచింతలోని ఆగ్జాలిక్ ఆమ్లం.. శరీరం క్యాల్షియం, ఐరన్లను గ్రహించడంలో అడ్డుగా ఉంటుంది. కాబట్టి, తగిన మోతాదులోనే తీసుకోవాలి.