వేల ఏండ్ల కిందటే ఈజిప్టును పరిపాలించిన ఫారోలు పుట్టగొడుగుల రుచిని ఆస్వాదించారు. ప్రాచీన కాలంలో గ్రీకులు, రోమన్లు వీటిని సైనికులకు ఆహారంగా పెట్టారు. పుట్టగొడుగులు మొక్కల జాతికి కాకుండా శిలీంధ్రాల కిందికి వస్తాయి. దాంతో ఇప్పటికీ కొంతమంది ఇవంటే అంతగా ఆసక్తి చూపించరు. అయితే, ఎంతో కమ్మగా ఉండి ఆరోగ్యానికి హామీ ఇచ్చే పుట్టగొడుగులు నిజంగానే ఓ సూపర్‌ఫుడ్.
పోషకాలతో నిండిన పుట్టగొడుగుల్లో క్యాలరీలు చాలా తక్కువ. వంద గ్రాముల్లో ఉండేది 34 క్యాలరీలే. అంతేకాదు కొలెస్ట్రాల్ లేని మంచి కొవ్వు… అదీ తక్కువ మోతాదులోనే ఉంటుంది. సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ. పుట్టగొడుగుల్లో అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. ప్రొటీన్లు, ఫైబర్, బి కాంప్లెక్స్, సి, డి విటమిన్లు, జింక్, కాపర్, మాంగనీస్ పుష్కలం. అరుదైన యాంటీ ఆక్సిడెంట్ సెలీనియం కూడా దొరుకుతుంది. ఇక ఇతర కూరగాయల్లో వండుతున్నప్పుడు పోషకాల నష్టం ఎక్కువ. పుట్టగొడుగుల్లో ఇలాంటిది ఉండదు.
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. వీటిలో ఎర్గోథియోనైన్ అనే యాంటీఇన్ఫ్లమేటరీ సూక్ష్మపోషకం ఉంటుంది. ఇది మన శరీర కణాలను రక్షిస్తుంది. వండినప్పుడు ఇది పుట్టగొడుగుల నుంచి విడుదలవుతుంది.
పుట్టగొడుగులు శరీరంలో తెల్ల రక్తకణాల వృద్ధిని ప్రేరేపిస్తాయి. ఇవి తేలిగ్గా అరిగిపోతాయి. పొట్ట సమస్యలను, పేగుల్లో ఆహారం నిల్వ ఉండటాన్ని తొలగించివేస్తాయి. ప్రోబయోటిక్ ఆహార పదార్థం కావడంతో రోగ నిరోధక వ్యవస్థను సహజంగానే బలోపేతం చేస్తాయి. వీటిలో ఉండే జింక్ తెల్ల రక్తకణాలకు శక్తిని
ప్రసాదిస్తుంది.
మన శరీర జీవక్రియల్లో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ బి ప్రధాన పాత్ర పోషిస్తాయి. పుట్టగొడుగుల్లో ఇవన్నీ సమృద్ధం. కాబట్టి, జీవక్రియలు సజావుగా సాగడానికి దోహదం చేస్తాయి. వీటిలోని విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్), బి3 (నియాసిన్) శరీర జీవక్రియలను వేగవంతం చేస్తాయి. ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉండటంతో కడుపు నిండిన భావన కలిగిస్తాయి. శరీరంలో క్యాలరీల భారాన్ని తగ్గించేస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.
పుట్టగొడుగులు కాలేయానికి టానిక్ లాంటివి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అలా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను అదుపులో ఉంచుతాయి. అంతేకాదు డయాబెటిస్ రోగులకు అవసరమైన ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవించే క్లోమ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి, మధుమేహ రోగులకు కూడా ఇవి మంచి ఆహారమే. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమితో బాధపడేవారికి కూడా పుట్టగొడుగులు గొప్పగా పనిచేస్తాయి.
కనీసం రెండు రోజులు పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని దోరగా వేయించి సూప్‌లు, సాస్‌లు, సలాడ్లు, పిజ్జాల్లో వాడుకోవచ్చు.
పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా ప్రయత్నించాలని పోషకాహార నిపుణుల సూచన. మార్కెట్లో ఎన్నో రకాల పుట్టగొడుగులు దొరుకుతున్నాయి. ఒక్కో దాన్నుంచి ఒక్కోరకం ప్రయోజనం.