Green Peas | పచ్చి బఠానీలు అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. వీటిని ఉడకబెట్టి లేదా వేయించుకుని తింటుంటారు. ఇలా తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక అనేక రకాల మసాలా వంటకాలు, రైస్ వంటకాల్లోనూ పచ్చి బఠానీలను వేస్తుంటారు. పచ్చి బఠానీలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అయితే పచ్చి బఠానీల్లో వాస్తవానికి ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల విటమిన్లు, మినరల్స్తోపాటు ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఈ క్రమంలోనే పచ్చి బఠానీలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని రోజూ ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పచ్చి బఠానీల్లో అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని, పోషణను అందిస్తాయి. వీటిని ఏ ఆహారంలో అయినా సరే కలిపి తినవచ్చు. లేదా ఉడకబెట్టి నేరుగానే తినవచ్చు. ఒక కప్పు పచ్చి బఠానీలను తినడం వల్ల సుమారుగా 50 నుంచి 60 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అలాగే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. అంతగా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. కనుక అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలని చూస్తుంటే వీటిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది. పచ్చి బఠానీలను తింటుంటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. నాన్ వెజ్ తినలేని వారికి ఇవి మంచి ప్రోటీన్లను అందిస్తాయి. ఒక కప్పు పచ్చి బఠానీలను తింటే సుమారుగా 30 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. దీంతో శక్తి లభిస్తుంది. కండరాలు ఉత్తేజం అవుతాయి.
పచ్చి బఠానీల్లో క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక కప్పు పచ్చి బఠానీలను తింటే సుమారుగా 20 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి బఠానీలను ఒక కప్పు మోతాదులో తింటే ఐరన్ 5 మిల్లీగ్రాముల మేర లభిస్తుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. వీటిని తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్ప మోతాదులో వీటిని సేవిస్తే సుమారుగా 10 నుంచి 15 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం అందిస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా ఈ ఫైబర్ ఎంతగానో సహాయ పడుతుంది.
పచ్చి బఠానీలను ఒక కప్పు మోతాదులో తింటే మనకు రోజకు కావల్సిన విటమిన్ ఎలో 4 శాతం వరకు లభిస్తుంది. అదే విటమిన్ కె అయితే 20 శాతం, విటమిన్ సి 15 శాతం, మాంగనీస్ 20 శాతం మేర లభిస్తాయి. పచ్చి బఠానీల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. వీటిల్లోని విటమిన్ కె ఎముకలను బలంగా ఉంచడంతోపాటు గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం అవకుండా జాగ్రత్త పడవచ్చు. వీటిల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా పచ్చి బఠానీలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.