మధ్యధరా సముద్ర తీర దేశాలవారు తీసుకునే ఆహారం చాలావరకు యాంటీఇన్ఫ్లమేటరీ డైట్ పరిధిలోకే వస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ‘న్యూట్రిషన్’ జర్నల్లో ప్రచురితమైన ఓ కొత్త అధ్యయనం.. మధ్యధరా తరహా ఆహారం దంపతుల సంతాన సఫలతను పెంచుతుందని తెలిపింది. కూరగాయలు, పండ్లు, ముడిధాన్యాలు, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె, కాయధాన్యాలు, బీన్స్, గింజలు, ఎండుఫలాలు వీరి ముఖ్య ఆహారం.
చేపలు, జున్ను, యోగర్ట్ మితంగా తింటారు. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం, అధిక చక్కెరలు ఉన్న ఆహారం, బాగా రీఫైన్ చేసిన ఆహార పదార్థాలను అతి తక్కువ మోతాదులో భుజిస్తారు. పురుషుల్లో వీర్యం నాణ్యత, స్త్రీలలో నెలసరి తదితర అంశాలపై.. వాపు, మంట మొదలైన ఇన్ఫ్లమేషన్స్ ప్రభావం చూపుతాయి. అంటే, పరోక్షంగా మనుషుల సంతాన సఫలతను ఇన్ఫ్లమేషన్ నిర్ధారిస్తుంది. ఆహారంలో యాంటీఇన్ఫ్లమేటరీ పదార్థాలు జోడిస్తే సంతాన సామర్థ్యం పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు చేసుకుంటే ఐవీఎఫ్ల అవసరం రాకపోవచ్చు.