Pecan Nuts | బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి అనేక రకాల నట్స్ గురించి చాలా మందికి తెలుసు. కానీ మనకు తెలియని ఇంకా ఎన్నో రకాల నట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇక అలాంటి నట్స్‌లో పీకన్ నట్స్ కూడా ఒకటి. అయితే వీటి గురించి చాలా మందికి తెలియదు. వీటి గురించి చాలా మంది ఎప్పుడూ విని కూడా ఉండరు. కానీ ఇవి కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పీకన్ నట్స్ ఎంతో రుచిగా ఉండడమే కాదు, అనేక పోషకాలను సైతం కలిగి ఉంటాయి. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ నట్స్‌ను రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు, పోషకాహార లోపాన్ని తగ్గించుకునేందుకు ఈ నట్స్ ఎంతగానో దోహదం చేస్తాయి. కనుక వీటిని రోజూ తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
పీకన్ నట్స్‌లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. కనుక ఈ నట్స్‌ను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. ఈ నట్స్‌లో మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల వీటిని తింటుంటే శరీరంలోని వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా రక్త నాళాల వాపులను తగ్గించుకోవచ్చు. దీని వల్ల రక్త నాళాలు వెడల్పుగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ నట్స్ ఎంతో దోహదం చేస్తాయి. ఈ నట్స్‌ను రోజూ తింటుంటే బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
పీకన్ నట్స్‌లో విటమిన్ ఇ తోపాటు పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని తింటే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఈ నట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. అలాగే ఈ నట్స్‌లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇలా బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. కనుక అధికంగా బరువు ఉన్నవారు రోజూ ఈ నట్స్‌ను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల మాంగనీస్ అధికంగా లభిస్తుంది. ఇది శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
పీకన్ నట్స్‌లో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణానికి సహాయం చేస్తుంది. ఐరన్‌ను శరీరం శోషించుకునేలా చేస్తుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్త హీనత తగ్గుతుంది. అలాగే నాడీ మండల వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. పీకన్ నట్స్‌లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తున్నవారు, జ్వరం వచ్చిన వారు ఈ నట్స్‌ను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల షుగర్ ఉన్నవారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఎంతో సహాయం చేస్తాయి. ఇలా పీకన్ నట్స్‌ను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే వీటిని రోజూ ఒక గుప్పెడు మోతాదులో తింటుంటే సరిపోతుంది.