Macadamia Nuts | నట్స్.. ఈ పేరు చెప్పగానే మనకు బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ గుర్తుకు వస్తాయి. కానీ మనకు తెలియని ఇంకా ఎన్నో రకాల నట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మెకడేమియా నట్స్ కూడా ఒకటి. ఇవి వెన్న రుచిని కలిగి ఉంటాయి. క్రీమ్ లాగా అనిపిస్తాయి. ఎంతో రుచిగా ఉండడమే కాదు అనేక పోషకాలను కూడా అందిస్తాయి. మెకడేమియా నట్స్‌లో క్యాలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మెకడేమియా నట్స్‌లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఈ కొవ్వులు మన శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
మెకడేమియా నట్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ నట్స్ మేలు చేస్తాయి. మెకడేమియా నట్స్‌లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్లేవనాయిడ్స్, టోకోట్రియనోల్స్ జాబితాకు చెందుతాయి. అలాగే ఈ నట్స్‌లో విటమిన్ ఇ కూడా అధికంగానే ఉంటుంది. ఇవన్నీ శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల క్యాన్సర్, డయాబెటిస్, నాడీ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ నట్స్‌లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దీంతో ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
మెకడేమియా నట్స్‌లో ఒమెగా 7 తోపాటు ఒమెగా 9 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడు యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. దీంతో మతిమరుపు తగ్గుతుంది. చిన్నారులు అయితే చురుగ్గా పనిచేస్తారు. మెదడు యాక్టివ్‌గా మారి చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఉన్నవారు ఈ నట్స్‌ను తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ నట్స్‌ను తినడం వల్ల మూడ్ మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.
అధిక బరువు ఉన్నవారికి ఈ నట్స్‌ను వరం అనే చెప్పవచ్చు. ఈ నట్స్‌లో క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉన్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గేలా చేస్తాయి. రోజూ గుప్పెడు మెకడేమియా నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుందని, అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. ఈ నట్స్ వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడి కొవ్వు కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గి నియంత్రణలో ఉంటుంది. మెకడేమియా నట్స్‌ను తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా మెకడేమియా నట్స్ వల్ల అనేక లాభాలను పొందవచ్చు.