Hair Fall Home Remedies | అందమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది శిరోజాలు అందంగా, కాంతివంతంగా, పొడవుగా కనిపించాలని అనుకుంటారు. ప్రస్తుత తరుణంలో కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా శిరోజాల అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అయితే జుట్టు రాలడం అన్నది ప్రస్తుతం చాలా ఇబ్బందిగా మారింది. స్త్రీలు, పురుషులు ఇరువురూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని కోట్ల మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పోషకాహార లోపం, కాలుష్యం, నీటి ప్రభావం, చర్మ వ్యాధులు ఉండడం, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండడం, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో జుట్టు బాగా రాలిపోతుందని కంగారు పడుతుంటారు. ఆందోళన చెందుతుంటారు.
అయితే జుట్టు రాలే సమస్యను పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో ఇది బట్టతలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. స్త్రీలకు కాదు కానీ పురుషులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని రకాల సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చని హెయిర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటిస్తే జుట్టు పెరగడమే కాదు, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లడం వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయని, శిరోజాలు కాంతివంతంగా మారుతాయని అంటున్నారు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బయట మార్కెట్లో మనకు రోజ్మేరీ ఆయిల్ లభిస్తుంది. దీన్ని తెచ్చి నాలుగు చుక్కలు వేసి కొబ్బరినూనెలో కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 2 గంటలు అయ్యాక తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారి మృదువుగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దృఢంగా కూడా ఉంటుంది. అలాగే టీ ట్రీ ఆయిల్‌ను కూడా ఇదే రకంగా వాడవచ్చు. ఈ ఆయిల్‌ను వాడడం వల్ల తలలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దీంతో దురద నుంచి బయట పడవచ్చు. చుండ్రు కూడా తగ్గుతుంది. చుండ్రును తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది.
కలబంద గుజ్జును సేకరించి నేరుగా జుట్టుకు రాయవచ్చు. 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల జుట్టుకు రిపేర్ అవుతుంది. జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. వేపాకులను పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. వారంలో కనీసం ఇలా రెండు సార్లు చేస్తే శిరోజాలు కాంతివంతంగా మారి మృదువుగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు పొడవుగా, ఒత్తుగా పెరుగుతాయి. అలాగే తలలో ఉండే ఇన్ఫెక్షన్లు, దురద తగ్గుతాయి. చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది.
జుట్టుకు మందార పువ్వుల మిశ్రమాన్ని కూడా పట్టించవచ్చు. దీన్ని 30 నిమిషాల తరువాత కడిగేయాల్సి ఉంటుంది. మందార పువ్వులు జుట్టుకు మంచి పోషణను ఇస్తాయి. అందువల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టుకు ఉల్లిపాయ మిశ్రమాన్ని లేదా నిమ్మరసాన్ని కూడా పట్టించవచ్చు. అయితే వీటిని ఉపయోగించిన తరువాత తలస్నానం చేశాక జుట్టుకు ఏదైనా ఆయిల్ రాయాలి. దీంతో జుట్టు పొడి బారకుండా మృదువుగా ఉంటుంది. అలాగే జుట్టులో ఉండే దురద తగ్గుతుంది. చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు.