Green Tea For Weight Loss | అధికంగా ఉండే మన శరీర బరువే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ విషయాన్ని వైద్యులు తరుచూ చెబుతూ ఉండడంతో మనలో చాలా మందికి ఆరోగ్యం మీద స్పృహ వచ్చిందనే చెప్పవచ్చు. దీంతో శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రోజూ వ్యాయామం చేయడం, కఠినమైన ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నీటిని తాగడం, అధిక క్యాలరీలను తగ్గించడం, ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవడం ఇలా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బరువు తగ్గాలని ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో ఆకలితో అనేక బాధలు పడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు అనవసరమైన ఆకలి బాధలు పడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఆకలి బాధలను నియంత్రించడానికి ఒక చిట్కాను కూడా చెబుతున్నారు.
బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు గ్రీన్ టీని తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. గ్రీన్ టీ లో ఎపిగాల్లోకాచెటిన్ గాలేట్ ( ఇజిసిజి) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించే అడిపోనెక్టిన్ అనే హార్మోన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఆకలి నియంత్రణలో ఉండడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. చాలా మంది బరువు తగ్గాలనుకున్నప్పటికీ ఆకలిని నియంత్రించుకోలేక ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి బరువును అదుపులో ఉంచుకోగలుగుతారు. అలాగే కొందరిలో విపరీతమైన ఆకలి ఉంటుంది. ఆకలిని వాళ్లు అస్సలు తట్టుకోలేక ఎప్పుడూ చూసినా తింటూనే ఉంటారు. అలాంటి వారు కూడా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మీరు ఆకలిని నియంత్రించుకోవాలనుకుంటే ఇజిసిజి అధికంగా ఉండే గ్రీన్ టీని తాగడం మంచిది. అంతేకాకుండా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గ్రీన్ టీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీని తాగడంతో పాటు అనవసరమైన ఆకలిని నియంత్రించుకోవడానికి భోజనానికి ముందు ఇసాబ్గోల్ తీసుకోవడం చేయాలి. అలాగే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా ఉంటుంది. చిరుతిండి తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే ప్రయాణానికి ఆకలి బాధలు అడ్డుగా ఉండకూడదు అనుకునే వారు ఆకలిని నియంత్రించుకోవాలనుకునే వారు ఈ చిట్కాను పాటించడం మంచిది.