‘గోల్డెన్ అవర్’.. వైద్యపరిభాషలో ఈ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది మనుషుల ప్రాణాలతో ముడిపడిన విలువైన సమయం. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఒక నిర్ణీత సమయంలో సదరు రోగులను దవాఖానకు తరలించి, సరైన చికిత్స అందించే సమయాన్నే వైద్య పరిభాషలో గోల్డన్ అవర్‌గా పరిగణిస్తారు. రోగి కార్డియాక్
అరెస్ట్ లాంటి సమస్యలకు గురై, జీవన్మరణంతో పోరాటం చేస్తున్న సమయంలో ప్రతి సెకనూ అత్యంత విలువైనదే! బాధితులకు అవి నిజంగానే అమృత ఘడియలు అని చెప్పవచ్చు. అసలు ఈ గోల్డెన్ అవర్ అని ఏ సమయాన్ని అంటారు?, ఎలాంటి అనారోగ్య సమస్యలకు లేదా ప్రమాదాలకు ఈ గోల్డెన్ అవర్ వర్తిస్తుంది? ఈ గోల్డెన్ అవర్‌లో ఎలాంటి రోగాలు, ఎలాంటి ప్రమాదాలకు గురైన బాధితులకు చికిత్స అందించవచ్చు? ఏయే చికిత్సలు చేయవచ్చు? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
‘జీవితం.. క్షణ భంగురం’ అంటారు పెద్దలు. అవును, ఏదైనా ఆపద తలెత్తినప్పుడు ఆ ఒక్క క్షణమే మనిషి ప్రాణాలను నిలబెడుతుంది. ఆ ఒక్క క్షణం ఆలస్యంతోనే… మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ‘కాస్త ముందుగా తెచ్చి ఉంటే బతికించేవాళ్లం’ అని వైద్యులు చెప్పే సన్నివేశాలు ఎన్నో సినిమాల్లో మనం చూశాం. కాలం ఎంత విలువైనదో ఇలాంటి సందర్భాల్లోనే తెలుస్తుంది. అందుకే గోల్డెన్ అవర్‌లో ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు. సత్వర చికిత్స అందించగలిగితే ఒక మనిషి ప్రాణాన్నే కాదు.. ఆ వ్యక్తి కుటుంబాన్ని కాపాడినట్టు అవుతుంది.
సాధారణంగా ధమనిలో ఏర్పడిన అవరోధం కారణంగా గుండె భాగానికి రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా కానప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. ఈ సమయంలో గుండె కొట్టుకుంటుంది కానీ, దాని పనితీరు మందగిస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే శాశ్వతంగా గుండె కండరాలు దెబ్బతిని పంపింగ్ తగ్గిపోతుంది. దీని వల్ల రక్తపోటు పడిపోయి షాక్‌లోకి వెళ్లి రోగి మృతి చెందే ప్రమాదం ఉంటుంది. అందుకని గుండెపోటు వచ్చిన తొలి గంటలోపు అంటే గోల్డన్ అవర్‌లో సరైన చికిత్స అందించాలి.
గుండెపోటు వచ్చిన తొలి 60 నిమిషాల్లో కార్డియాక్ అరెస్ట్ సంభవించే ప్రమాదం ఎక్కువ. గుండెకు సంబంధించిన విద్యుత్ వ్యవస్థ విఫలమైనప్పుడు కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. దీనివల్ల గుండె పంపింగ్ పూర్తిగా ఆగిపోతుంది. రోగి కుప్పకూలిపోతాడు. శ్వాస ఆగిపోయి, పల్స్ పడిపోతుంది. శరీరానికి రక్తసరఫరా నిలిచిపోయి 10 నిమిషాల్లో బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఇది తీవ్రమైన అత్యవసర సమయం. వెనువెంటనే చికిత్స అందించకపోతే నిమిషాల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని కార్డియాక్ అరెస్ట్‌లో గోల్డెన్ సెకన్లలోనే (అతి శీఘ్రంగా) చికిత్స అవసరం.
ఏదైన ప్రమాదం జరిగినప్పటి నుంచి గంటలోపు సమయాన్ని గోల్డన్ అవర్ అంటారు. ఎందుకంటే రోగి ప్రమాదానికి గురైన వెంటనే గుండె, మెదడు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ (సీడీసీ) ప్రకారం హఠాత్తుగా జరిగే కార్డియాక్ అరెస్ట్ మరణాలలో సగం మరణాలు దవాఖానకు చేరుకునేలోపే జరుగుతున్నాయి.
పలు వైద్య అధ్యయనాల ప్రకారం ఆక్సిజన్ అందనప్పుడు గుండె కండరాలు 80 నుంచి 90 నిమిషాల్లోనే చనిపోతుంటాయి. ఇక ఆరు గంటల తరువాత రోగి కోలుకోలేని విధంగా పరిస్థితి విషమిస్తుంది.
గుండెపోటు వచ్చినప్పటి నుంచి గంట వ్యవధిలోపు సరైన వైద్యం అందించడం ఎంతో కీలకం. ముఖ్యంగా గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించి, శాశ్వత నష్టాన్ని నిరోధించే ప్రైమరీ యాంజియోప్లాస్టి వంటి విధానాలు రోగిని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక కార్డియాక్ అరెస్ట్‌లో గోల్డెన్ సెకన్లోనే స్పందించాల్సి ఉంటుంది. అంటే కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే సీపీఆర్ లాంటివి చేయాల్సి ఉంటుంది.
కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వారిలో సీపీఆర్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలినప్పుడు సీపీఆర్ చేయకపోవడం వల్ల ప్రతి నిమిషానికి 10 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. అందుకని ఇలాంటి సందర్భాల్లో రోగికి వెంటనే అంటే నిమిషాల్లోపు సీపీఆర్ చేయాలి. దీని వల్ల బాధితుడి ప్రాణాలను కాపాడవచ్చు. సీపీఆర్ అంటే ఛాతీ మధ్యలో గట్టిగా, వేగంగా నొకడం లాంటివి చేయాలి. ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) అందుబాటులో ఉంటే, ఆలస్యం చేయకుండా ఉపయోగించాలి. అయితే ఈ గోల్డెన్ అవర్ అనేది గుండె పరిస్థితులకు మాత్రమే పరిమితం కాదు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, స్ట్రోక్స్, ఇతర క్లిష్టమైన అనారోగ్యాలను నిర్వహించడంలో కీలకమని గుర్తుంచుకోవాలి.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ వి. శ్రీరామచంద్ర
చీఫ్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్
శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, హైదరాబాద్