Glaucoma | జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా కళ్లకు సంబంధించిన వివిధ వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతున్నది. పొగతాగడం, స్క్రీన్ టైమ్ పెరగడంతో చిన్న వయసులోనే గ్లాకోమా బారినపడుతున్నారు. గ్లాకోమా కారణంగా మీ కంటిచూపును శాశ్వతంగా దూరం చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. గ్లాకోమా అనేది కంటి సమస్య. ఇది కంటి నాడిని దెబ్బతీస్తుంది. ఆప్టిక్ నాడి మీ కంటి నుంచి . మీ మెదడుకు చూపునకు సంబంధించి సమాచారాన్ని పంపుతుంది. అలాగే ఏదైనా విషయాన్ని గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. కొన్ని అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఈ నరాలను దెబ్బతీస్తాయి. దాంతో కండ్లపై ఒత్తిడిని పెంచుతాయి. సాధారణ కంటి ఒత్తిడితో కూడా గ్లాకోమా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే, పిల్లల్లో పెరుగుతున్న కంటి సమస్యలపై ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
గ్లాకోమా ఏ వయసులో వారికైనా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వృద్ధుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. 60 ఏళ్లుపైబడిన వారిలో అంధత్వానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటి. గ్లాకోమా సాధారణంగా అనేక లక్షణాలు కనిపించవు. అయితే, వ్యాధిముదిరే కొద్దీ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కంటి సమస్యను అరికట్టాలంటే.. ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించేందుకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గ్లాకోమాను ముందస్తుగానే గుర్తించినట్లయితే దృష్టి లోపాలను తగ్గించడంతో పాటు నివారించేందుకు అవకాశం ఉంటుంది.
ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అని పిలిచే ఓ రకమైన గ్లాకోమా. చాలా మందికి లక్షణాలు కనిపించవు. వ్యాధిని తొలిదశల్లో గుర్తించేందుకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. గ్లాకోమా లక్షణాల్లో కంటి వద్ద నొప్పి లేదంటే ఒత్తిడి ఉంటుంది. కళ్లలో నొప్పి కారణంగా తలనొప్పి సమస్య ఉంటుంది. వికారం లేదంటే వాంతులు, అస్పష్టమైన దృష్టి, కాంతిని చూడలేకపోవడం, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలుంటాయి. ఎవరైనా గ్లాకోమాకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి గ్లాకోమా వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా గ్లాకోమా ఉంటే.. మిగతా వారికి సైతం వచ్చే చాన్స్ ఉంటుంది. అలాగే పై బీపీ సమస్యతోనూ ప్రమాదం పెంచుతుంది. దీర్ఘకాలికంగా కార్టికోస్టెరాయిడ్స్ ఉపయోగం సైతం గ్లాకోమాకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మయోపియా.. కంటి గాయం సైతం వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
రోజువారీ జీవితంలో కొన్ని చర్యలు పాటిస్తే గ్లాకోమా ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. క్రమంగా తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం సైతం కీలకమే. కంటి గాయం కూడా గ్లాకోమాకు దారి తీస్తుంది. ఏదైనా క్రీడల్లో పాల్గొన్న సమయంలో రక్షణ చర్యలు పాటించాలి. గ్లాకోమా లక్షణాలు కనిపిస్తే, పరీక్షలు చేయించుకొని.. వైద్య సలహా పొందాలి.