మా పిల్లవాడి వయసు మూడు సంవత్సరాలు. పుట్టగానే కంజెనిటల్ డయాఫ్రగ్మాటిక్ హెర్నియా (సీడీహెచ్) ఆపరేషన్ జరిగింది. వారం క్రితం జలుబు, దగ్గుతోపాటు బాగా జ్వరం రావడంతో డాక్టర్‌కు చూపించాం. ఎక్స్‌రే తీసి న్యుమోనియా అనిచెప్పి, యాంటి బయాటిక్స్ ఇచ్చారు. ఇప్పుడంతా తగ్గింది. అయితే, బాబుకు ఇలా మళ్లీమళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుందా? ఇప్పటికే బాబు ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయి కదా! భవిష్యత్తులో మళ్లీ ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? రాకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి.
కంజెనిటల్ డయాఫ్రగ్మాటిక్ హెర్నియా (సీడీహెచ్) అంటే.. మామూలుగా పొట్టలో ఉండాల్సిన పేగులు, మిగతా అవయవాలు ఛాతీలోకి రావడం. ఈ రెండిటినీ వేరుచేస్తూ శ్వాసకు ఉపయోగపడే కండరాన్ని డయాఫ్రమ్ అంటారు. ఆ డయాఫ్రమ్లో రంధ్రం ఉంటే.. సమస్య వస్తుంది. ఇది చాలాసార్లు బిడ్డ పుట్టకముందే తెలుస్తుంది. మీ బిడ్డ విషయంలోనూ ముందే తెలుసుకోవడం, ఆపరేషన్ కూడా చేయించడం మంచి విషయం. ఇటువంటి పిల్లల్లో.. న్యుమోనియా రావడానికి ప్రత్యేకమైన రిస్క్ అంటూ ఏమీ ఉండదు. కాకుంటే, మిగతా పిల్లలతో పోలిస్తే ఇలా ఊపిరితిత్తులకు ఆపరేషన్ అయినవాళ్లలో లక్షణాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. అదేకాకుండా కొంచెం వాంతులు (రీఫ్లక్స్) అవుతుంటాయి. కాబట్టి, మిగతా పిల్లలతో పోలిస్తే.. వీళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా, లక్షణాలను తట్టుకోలేక పోవడం వంటి సమస్యలు ఉంటాయి.
అందుకే, ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవడం చాలాముఖ్యం. ఇందుకోసం ఇలాంటి పిల్లలను సోషల్ గ్యాదరింగ్స్కు దూరంగా ఉంచాలి. అంటే.. పదిమంది గుమిగూడే ప్రదేశంలో ఎక్కువగా ఉంచకూడదు. ముఖ్యంగా, జలుబు-దగ్గు ఉన్నవారికి దూరంగా ఉంచాలి. ఏటా అవసరమైన ‘ఫ్లూ’ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాలి. న్యుమోనియా రాకుండా ‘నీమోకొక్కల్ వ్యాక్సిన్’ ఉంటుంది. అది మీ బిడ్డకు ఇప్పించారో లేదో తెలియదు. ప్రభుత్వం కూడా ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తున్నది. ఈ వ్యాక్సిన్ కొన్నిరకాల న్యుమోనియాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే.. బిడ్డకు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు. మిగతావాళ్లతో పోలిస్తే.. భవిష్యత్తులో ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ ఎక్కువగా ఏమీ ఉండదు. ఇన్ఫెక్షన్స్ వస్తేమాత్రం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు మీ బిడ్డ విషయంలో పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా చలికాలం, వర్షాలు పడే సమయంలో బయటికి ఎక్కువగా వెళ్లనీయకండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. నీమోకొక్కల్ వ్యాక్సిన్ కూడా వేయిస్తే మీ బిడ్డను ఇన్ఫెక్షన్ బారినుంచి కాపాడుకోవచ్చు.