e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఆరోగ్యం Genetic Oncology | క్యాన్సర్‌ చికిత్సలో.. జన్యు ఆంకాలజీ!

Genetic Oncology | క్యాన్సర్‌ చికిత్సలో.. జన్యు ఆంకాలజీ!

అవగాహన లోపమే క్యాన్సర్‌కు ప్రధాన కారణం. క్యాన్సర్‌ అనేది 10 నుంచి 20 శాతం వంశ పారంపర్యం. 70 శాతం జీవన విధానంలో లోపాలు, ఆహారపు అలవాట్లలో తేడాలు, అనారోగ్యకరమైన వ్యసనాలు.. తదితర కారణాల వల్ల వస్తుంది. 10 శాతం సందర్భాల్లో మాత్రం మూలాలను కచ్చితంగా ఊహించలేం. ఈ పరిమితిని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిందే ‘జన్యు ఆంకాలజీ’.

మనిషి శరీరంలో కణ విభజన సమతుల్యంగా జరగాలి. ఆ ప్రక్రియ అడ్డదిడ్డంగా జరిగినప్పుడు వచ్చే మార్పునే ‘మ్యుటేషన్‌’ అంటారు. ఇదే క్యాన్సర్‌కు ప్రధాన కారణం. క్యాన్సర్‌ పేరు చెప్పగానే.. ప్రాణాంతక వ్యాధిగానో, మరణ శాసనంగానో భావిస్తారు చాలామంది. ఇదంతా ఒకప్పటి మాట. సకాలంలో గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే దీన్ని సమూలంగా రూపుమాపవచ్చు. తొలి దశలోనే, క్యాన్సర్‌ వ్యాధి మూలాలను తెలుసుకునే ఆధునిక పద్ధతి.. జన్యు ఆంకాలజీ. దీని ద్వారా క్యాన్సర్‌ ఎందుకు వచ్చింది? ఏ జన్యు లోపం వల్ల వచ్చింది? వ్యాధి ఏ అవయవంపై ప్రభావం చూపుతున్నది? చికిత్స తరువాత కూడా మళ్లీ వచ్చే ఆస్కారం ఉందా? ఆనువంశికంగా పిల్లలకూ వాళ్ల పిల్లలకూ విస్తరిస్తుందా? .. అన్న విషయాలను తెలుసుకోవచ్చు. రోగికి ఏ మందులు ఇవ్వాలి? ఎలాంటి చికిత్సా విధానం ద్వారా నయం చేయవచ్చు? అన్నదీ జన్యు ఆంకాలజీ ద్వారా తెలుసుకునే అవకాశాలుఉన్నాయి. ఇది రెండు రకాలు.

  1. థెరపెటిక్‌ ఆంకాలజీ.
  2. డయగ్నొస్టిక్‌ జెనెటిక్‌ ఆంకాలజీ.
- Advertisement -

థెరపెటిక్‌ ఆంకాలజీ (చికిత్సా విధానం)
క్యాన్సర్‌ చికిత్సకు అవసరమైన పద్ధతిని ఎంచుకునే విధానమే.. థెరపెటిక్‌ ఆంకాలజీ. ఇందులో రెండు పద్ధతులున్నాయి. మొదటిది, ‘కార్‌-టి సెల్స్‌ థెరపీ’. రెండోది, జన్యువులను కత్తిరించే పద్ధతి. జెనెటిక్‌ స్లయిసింగ్‌ విధానమనీ అంటారు.

కార్‌-టీ సెల్స్‌ థెరపీ
కైమరిక్‌ యాంటీజెన్‌ రిసెప్టార్‌-టి సెల్‌ థెరపీ (కార్‌-టి సెల్‌ థెరపీ).. దీన్నే జీన్‌ థెరపీ అనీ పిలుస్తారు. ఈ విధానంలో రోగిలోని క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా ఇమ్యూనిటీని (టీ-సెల్స్‌) ఉత్తేజపరిచి, తిరిగి ఆ టీ-సెల్స్‌ను సదరు రోగికి ఎక్కిస్తారు. అంటే, ఇమ్యూనిటీ వ్యవస్థలో జన్యు మార్పిడి చేస్తారన్నమాట. కాకపోతే, కార్‌-టీ సెల్‌ థెరపీ అనేది చాలా ఖరీదైన వ్యవహారం. ప్రస్తుతం అమెరికాలాంటి దేశాల్లోనే లభిస్తోంది. మన దేశంలోనూ అందుబాటులోకి వస్తే, క్యాన్సర్‌ రోగులకు పెద్ద ఊరటే. ఖర్చు కూడా తగ్గుతుంది.

జెనెటిక్‌ స్ల్పయిసింగ్‌
వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ల విషయంలో.. వాటికి కారణమైన జన్యువులను గుర్తించి, సమూలంగా తొలగించే ప్రక్రియనే జెనెటిక్‌ స్లయిసింగ్‌ అంటారు. దీనివల్ల క్యాన్సర్‌కారక జన్యువులు తదుపరి తరాలకు విస్తరించవు. భవిష్యత్‌ తరాలు నిశ్చింతగా ఉండవచ్చు. ఈ విధానంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉన్నది. జన్యు ఆంకాలజీలో వివిధ రోగ నిర్ధారణ పద్ధతులు ఉన్నాయి.

డయగ్నొస్టిక్‌ జెనెటిక్‌ ఆంకాలజీ
ఈ పద్ధతి ద్వారా క్యాన్సర్‌ రోగ నిర్ధారణ జరుపుతారు. దీన్నే ‘నెక్ట్స్‌ జెనరేషన్‌ సీక్వెన్స్‌'(ఎన్‌జీఎస్‌) టెస్ట్‌ అంటారు. ఈ పరీక్ష ద్వారా ఐదు రకాల అంశాలను నిర్ధారించవచ్చు. గతంలో ఫలితాలు రావడానికి ఐదు నెలల సమయం పట్టేది. ఖర్చు కూడా ఐదారు లక్షలు దాటేది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో, నివేదికలు మూడు వారాలలోనే వస్తున్నాయి. ఖర్చు కూడా రూ.40 వేలకు తగ్గింది. ఈ నిర్ధారణ పరీక్ష ద్వారా కింది అంశాలను తెలుసుకోవచ్చు.

జెర్మ్‌లైన్‌ మ్యుటేషన్‌ టెస్ట్‌
ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్‌ వ్యాధి భవిష్యత్‌ తరాలకు వచ్చే ఆస్కారం ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా రెండు రకాల లోపాల వల్ల క్యాన్సర్‌కు ఆస్కారం ఉంటుంది. అందులో ఒకటి, ట్యూమర్‌ సప్రెషర్‌ జీన్‌ లోపం. ప్రతి మనిషిలో సహజంగా ట్యూమర్‌ సప్రెషర్‌ జీన్‌ అనేది ఉంటుంది. ఇది ట్యూమర్స్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ జీన్‌ లేనివారికి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. రెండోది ప్రోటో ఆంకో జీన్‌. ఈ జీన్‌ క్యాన్సర్‌ కారకంగా పనిచేస్తుంది. ఇది ఉందంటే, క్యాన్సర్‌ చుట్టుముట్టే పరిస్థితులు దాదాపుగా ఉన్నట్టే. 50 ఏండ్లలోపు వారి విషయంలో క్యాన్సర్‌ అనేది వారసత్వంగా, జన్యు పరంగా వచ్చే అవకాశాలే అధికం. అందుకని, యాభై ఏండ్లలోపు వ్యాధిగ్రస్థులకు జెర్మ్‌లైన్‌ మ్యుటేషన్‌ టెస్ట్‌ చేస్తారు. ఈ పరీక్షలో ట్యూమర్‌ సప్రెషర్‌ జీన్‌ లేకపోయినా, ప్రోటో ఆంకో జీన్‌ ఉన్నట్లు తేలినా. ఆ రోగి పిల్లలకూ జెర్మ్‌లైన్‌ మ్యుటేషన్‌ టెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. వ్యాధి వచ్చే అవకాశాలున్నట్లు తేలితే, ప్రారంభ దశలోనే
అడ్డుకట్ట వేయవచ్చు.

కీమో సెన్సిటివిటీ టెస్ట్‌
ఈ టెస్ట్‌ ద్వారా రోగికి ఎలాంటి మందులు సమర్థంగా పనిచేస్తాయో తెలుసుకోవచ్చు. సాలిడ్‌ బయాప్సీ లేదా లిక్విడ్‌ బయాప్సీ ద్వారా రోగ కారకమైన జన్యువును గుర్తిస్తారు. అనంతరం, ఆ గుర్తించిన జన్యువులపై పనిచేసే మందులను రోగికి ఇస్తూ వ్యాధిని నియంత్రిస్తారు. ఉదాహరణకు ఊపిరితిత్తులు, బ్లడ్‌ క్యాన్సర్‌లలో ‘టీకేఐ’ మాత్రల ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి.

జెనెటిక్‌ సిండ్రోమ్‌ టెస్టింగ్‌
ఈ పరీక్ష ద్వారా రోగి శరీరంలోని ఇతర అవయవాలకు క్యాన్సర్‌ సోకే ఆస్కారం ఉందా? అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు బ్రాకా జన్యులోపం ఉన్న మహిళల్లో రొమ్ముతో పాటు అండాశయ క్యాన్సర్‌కు అవకాశం ఎక్కువ. అదే విధంగా లించ్‌ సిండ్రోమ్‌గా వ్యవహరించే నాన్‌-పాలిపోసిస్‌ కొలరెక్టల్‌ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థుల విషయంలో.. ఒక క్యాన్సర్‌ తగ్గాక, ఇతర శరీర భాగాలను కూడా వివిధ రకాల క్యాన్సర్లు చుట్టుముట్టే పరిస్థితులు ఎక్కువ. ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్‌కు ఆస్కారం ఉన్న శరీర భాగాలను నిర్ధారించుకొని, ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చు.

మినమల్‌ రెసిడ్యూయల్‌ డిసీజ్‌ అండ్‌ సర్క్యులేటింగ్‌ ట్యూమర్‌ సెల్స్‌ టెస్ట్‌
ఈ పరీక్ష ద్వారా వ్యాధి పునరావృతమయ్యే పరిస్థితులను బేరీజు వేయవచ్చు. కొన్నిసార్లు క్యాన్సర్‌ను తొలగించిన తరువాత కూడా, సూక్ష్మాతి సూక్ష్మమైన క్యాన్సర్‌ కణాలు శరీరంలో ఇంకా మిగిలిపోతాయి. దీంతో, క్యాన్సర్‌ మళ్లీ దాడిచేసే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ పరీక్షల్లో బయటపడదు. సీటీసీ, ఎంఆర్‌డీ పరీక్షల ద్వారా మాత్రమే మిగిలిపోయిన కణాలను గుర్తించవచ్చు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన రోగులకు, మరింత శక్తిమంతమైన చికిత్స అందించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. జన్యు ఆంకాలజీ విధానం స్త్రీలకు ఓ వరం. ఎందుకంటే.. మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. మరణాలూ సంభవిస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి జన్యు ఆంకాలజీని మించిన మార్గం లేదు. ఇక్కడ కుటుంబ చరిత్రనూ పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి, రక్త సంబంధీకుల క్యాన్సర్‌ మరణాల తాలూకు చేదు అనుభవాలు ఉన్నవారు ఏ చిన్న సంకేతాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. నిపుణులను సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

ఫార్మకో జీనోమిక్స్‌ టెస్ట్‌
ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్‌ ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలను సైతం తెలుసుకోవచ్చు. వేలి ముద్రల్లో సారూప్యత ఉండనట్టే, జన్యు చిత్రపటమూ ఒకేలా ఉండదు. ఈ జన్యు వైవిధ్యం కారణంగా ఒకే ఔషధం వేర్వేరు వ్యక్తుల మీద వేరువేరుగా ప్రభావాలు, ఫలితాలు చూపుతుంది. ఆ తేడాలను నిశితంగా పరిశీలించి, రోగికి ఇచ్చే ఔషధాల ద్వారా ఏ మేరకు సత్ఫలితాలు సాధించవచ్చో, ఏ మేరకు దుష్ఫలితాలు నియంత్రించవచ్చో ఓ అవగాహనకు రావచ్చు. క్యాన్సర్‌ కణాలను మట్టుపెట్టే చికిత్సను అందించవచ్చు.

… మహేశ్వర్‌రావు బండారి

డాక్టర్‌ ఎ.వి.సురేష్‌
మెడికల్‌ ఆంకాలజిస్ట్‌
కాంటినెంటల్‌ హాస్పిటల్‌,
హైదరాబాద్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana