మన వంటింట్లో వాడే మసాలా దినుసులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయని పలు అధ్యయనాలు వెల్లడించగా తాజాగా వెల్లుల్లితో అధిక కొవ్వును కరిగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇరాన్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ చేపట్టిన అధ్యయనంలో వెల్లుల్లి, నిమ్మరసంతో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెరుగ్గా కాపాడుకోవచ్చని వెల్లడైంది. వెల్లుల్లిలో ఉండే ఆర్గానిక్ సల్ఫర్ ఔషధం అల్లిసిన్ శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ డైటీషియన్ లౌరా జెఫర్స్ చెప్పుకొచ్చారు.
ఇంకా వెల్లుల్లి వాడకంతో రోగనిరోధక శక్తి మెరుగవడం, ఇన్ప్లమేషన్ను నివారించడం, గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. బీపీని నియంత్రణలో ఉంచడం, రక్తప్రసరణ సాఫీగా సాగడంలో వెల్లుల్లి సమర్ధవంతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.