మనిషికి శ్వాసించడం ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం పీల్చుకున్న ఆక్సిజన్‌ను.. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలతోపాటు అన్ని అవయవాలకు చేరవేసేది రక్తమే. ప్రమాదాల్లో గాయాల కారణంగా, రక్తహీనత ఏర్పడినప్పుడు, మహిళల్లో కాన్పు సమయాల్లో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఇలాంటప్పుడే రక్తదాతల అవసరం ఏర్పడుతుంది. ఒకరి రక్తదానం నుంచి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం మహాదానంగా పరిగణిస్తున్నారు. రక్తదాతా సుఖీభవ అంటున్నారు. జూన్ నెలను ప్రత్యేకంగా రక్తదాన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనిషి శరీరానికి అత్యంత కీలకమైన రక్తం చరిత్రను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ప్రమాదాల వల్ల గాయాల కారణంగా ఒంట్లో రక్తం బయటికి వెళ్లిపోతుంది. ఒకవేళ రక్తనష్టం భారీగా జరిగితే శరీరంలోని ప్రధాన అవయవాలైన మెదడు, గుండె తదితరాలకు రక్త సరఫరా నిలిచిపోయి అవి పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా బాధితుడు మరణించే ప్రమాదం ఉంది. అందువల్లనే సాధారణంగా ప్రమాదాల్లో గాయపడి, రక్తస్రావానికి గురైన బాధితులకు రక్తం ఎక్కిస్తుంటారు. మహిళల విషయానికి వస్తే చాలామందికి కాన్పు సమయంలో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. అలాంటి సమయంలో కూడా రక్తం అవసరమవుతుంది. ఇదికాక గుండె, కాలేయం, కిడ్నీలు తదితర పెద్దపెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు, ఇతర చికిత్సల సమయంలో రోగులకు రక్తం ఎంతో అవసరం. సరైన సమయంలో రక్తం ఎక్కించకపోతే కొన్నిసార్లు రోగి ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. అందుకే అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని గుర్తుంచుకోవాలి. అయితే, అందరి రక్తం అందరికీ పనికిరాదు. కాబట్టి, అసలు మనిషిలో రక్తం ఎలా ఉత్పత్తి అవుతుంది, రక్తంలో ఎన్ని గ్రూపులు ఉంటాయి, వాటి వివరాలు తెలుసుకుని ఉండాలి.
మనిషిలో రక్తం ఎముకలో మూలుగ (అస్థిమజ్జ) నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా జనించిన రక్తంలో ఎనిమిది ప్రధాన గ్రూపులుంటాయి. దీంతోపాటు మరొక అరుదైన గ్రూపు రక్తం కూడా ఉంది. ఎనిమిది ప్రధాన గ్రూపుల్లో నాలుగు గ్రూపులు పాజిటివ్‌కు సంబంధించినవి కాగా మరో నాలుగు గ్రూపులు నెగిటివ్‌కు సంబంధించినవి.
మనుషుల్లో సుమారు 90శాతం మంది పాజిటివ్ బ్లడ్ గ్రూపులకు చెందిన వారే. అందులో ఎక్కువమంది ‘ఒ-పాజిటివ్’కు చెందినవారు. కాగా, రెండో స్థానంలో ‘ఎ-పాజిటివ్’, మూడో స్థానంలో ‘బి-పాజిటివ్’, నాలుగో స్థానంలో ‘ఎబి-పాజిటివ్’ వాళ్లు నిలుస్తారు. అధే విదంగా ఎ-నెగెటివ్, బి-నెగెటివ్, ఎబి-నెగెటివ్, ఒ-నెగెటివ్ గ్రూపులు ఉంటాయి. ఈ ఎనిమిది గ్రూపుల్లో ‘ఎబి-నెగెటివ్’ గ్రూపు అరుదైనది. ప్రతి వెయ్యిమందిలో ఆరుగురు మాత్రమే ఈ గ్రూపు వాళ్లు ఉంటారు. ఇక చాలా అరుదైన గ్రూప్ ‘బాంబే బ్లడ్‌గ్రూప్’.
ఎవరైనా పాజిటివ్ రక్త వర్గం కలిగిన వారికి రక్తం ఎక్కించడం అత్యవసరమైతే ఒ-పాజిటివ్ రక్తాన్ని నిరభ్యంతరంగా ఎక్కించవచ్చు. అంటే ఎ-పాజిటివ్, బి-పాజిటివ్, ఎబి-పాజిటివ్ గ్రూపులకే ఇది సరిపోతుంది. కానీ నెగెటివ్ వర్గాల వారికి ఒ పాజిటివ్ రక్తం ఎక్కించకూడదు. అలా చేస్తే చాలా ప్రమాదం.
రక్త వర్గం పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా రోగి శరీరంలోకి నిర్భయంగా ఎక్కించగలిగే ఏకైక రక్త వర్గం ఒ-నెగెటివ్. అందుకే ఈ గ్రూపు రక్తాన్ని విశ్వదాత వర్గం అని పిలుస్తారు. అంటే ఒ-నెగెటివ్ రక్తం అందరి బంధువన్నమాట!
మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో 1952లో మొట్టమొదటి సారిగా ఈ రకమైన రక్తాన్ని గుర్తించారు. అందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు స్థిరపడిపోయింది. దీన్ని డాక్టర్ బెండె అనే వైద్యుడు కనిపెట్టాడు. ఇది 10వేల మందిలో ఒక్కరికి మాత్రమే ఉండే అరుదైన రక్తం. ఈ గ్రూపు వ్యక్తులకు ఇతర ఏ రకమైన రక్తాన్ని ఎక్కించేందుకు వీలు లేదు. కేవలం అదే గ్రూపు రక్తాన్ని మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది.
సాధారణంగా మనం చేసే రక్తదానం ద్వారా సేకరించిన రక్తం నుంచి రెండు రకాల ద్రవాలను, రెండు రకాల కణాలను తీస్తారు. అందులో ముఖ్యమైనది ‘ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్’. వీటినే ఎర్ర రక్తకణాలు అంటారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా అనే అనే నాలుగు ప్రధానమైన పదార్థాలు ఉంటాయి. ఒక వ్యక్తి దానం చేసిన రక్తం నుంచి హైస్పీడ్ రెవల్యూషన్ పద్ధతిద్వారా వీటిని వేరుచేస్తారు. రక్తాన్ని హైస్పీడ్ రెవల్యూషన్ మెషిన్ ద్వారా తిప్పినప్పుడు ఎర్ర రక్తకణాలన్నీ అడుగుభాగానికి చేరుకుంటాయి. ప్లాస్మా అనే ద్రవ పదార్థం పైభాగంలో తేలుతుంది. ప్లేట్లెట్స్ మధ్యభాగంలో ఉండిపోతాయి. వీటిని ప్రత్యేక పద్ధతి ద్వారా వేరుచేస్తారు. రోగుల ఆరోగ్య అవసరాలకు తగినట్టుగా ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను ఎక్కిస్తారు.
ఎర్ర రక్తకణాలు ఉన్న ద్రవాన్ని రెడ్ బ్లడ్ సెల్స్(ఆర్బిసి) అంటారు. ఎర్ర రక్తకణాలు మనం పీల్చుకున్న ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. వీటిని 2 డిగ్రీల నుంచి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య 43 రోజులపాటు నిల్వ ఉంచవచ్చు. ప్రమాదాలు, గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల సమయంలో, మహిళలకు కాన్పు సమయంలో, రక్తహీనత గలవారికి ఎర్ర రక్తకణాలను ఎక్కిస్తారు.
ప్లేట్లెట్స్ కణాలు రక్తస్రావాన్ని అరికడతాయి. అంటే రక్తం శరీరంలో నుంచి కారిపోకుండా ప్లేట్లెట్స్ అడ్డుపడతాయన్నమాట. పెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు, ప్రమాదాల వల్ల రోగికి తీవ్ర రక్తస్రావం అయిన పరిస్థితుల్లో ప్లేట్‌లెట్స్‌ను ఎక్కిస్తారు. అంతే కాకుండా క్యాన్సర్, డెంగ్యూ వంటి విషజ్వరాలు వచ్చినప్పుడు కూడా రోగి రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఇలాంటివారికి కూడా ప్లేట్లెట్స్ ఎక్కించడం అవసరమవుతుంది. 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ప్లేట్‌లెట్స్‌ను 5 రోజులపాటు నిల్వ చేయవచ్చు.
కాలిన గాయాల బాధితులకు ఎక్కువగా ప్లాస్మాను ఎక్కిస్తారు. అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు ఒంటి మీద చర్మం కాలిపోయి మాంసం తేలుతుంది. దీంతో రక్తంలోని ద్రవ పదార్థం ఒంట్లోనుంచి ఆవిరైపోతుంది. ప్లాస్మా శరీరంలో విష పదార్థాలను నిరోధిస్తుంది. కాలినప్పుడు ప్లాస్మా ఆవిరైపోవడంతో శరీరంలో విషపదార్థాలు చేరుకుంటాయి. దీన్నే ఇన్ఫెక్షన్ అంటారు. అంటే ప్లాస్మా తగ్గిపోతే ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయన్నమాట. ప్లాస్మాను మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచవచ్చు. కాలిన గాయాలకు గురైన వారికి, దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగ్రస్తులకు ప్లాస్మాను ఎక్కువగా వినియోగిస్తారు.
ఏ కారణంగా ఏర్పడినప్పటికీ రక్తహీనత అనేది చాలా ప్రమాదకరం. శరీరంలో తగినంత రక్తం లేకపోతే మనిషి ఆరోగ్యంగా జీవించలేడు. శరీరంలో ప్రవహించే రక్తం మెదడు, గుండెతోపాటు ఇతర అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. రక్త ప్రసరణ తగ్గిపోయినా, ఆగిపోయినా ముందు మెదడు పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత గుండె మొరాయిస్తుంది. రక్తహీనత వల్ల బీపీ పడిపోతుంది. రక్త ప్రసరణ లేకుండా మెదడు కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే తట్టుకోగలదు. ఈ సమయం దాటితే మెదడు శాశ్వతంగా పనిచేయకుండా పోతుంది. రక్తహీనత వల్ల దెబ్బతినే రెండవ ప్రధాన అవయవం గుండె. రక్తప్రసరణ ఆగిపోతే గుండె సుమారు 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే పనిచేయగలుగుతుంది. అంతకుమించితే గుండె శాశ్వతంగా ఆగిపోతుంది.
సాధారణంగా ఒక వ్యక్తి నుంచి 450 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తం సేకరించే ముందు రక్తదానం చేసేవారికి కొన్ని ప్రధానమైన పరీక్షలు చేస్తారు. రక్తదానం చేయడానికి అర్హతలు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ ప్రసాద్ నిలోఫర్ బ్లడ్‌బ్యాంక్ మాజీ ఇంచార్జీ