Fruits That Reduce Uric Acid | మన శరీరం నుండి వెలువడే వ్యర్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. సాధారణంగా ఈ యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ ఈ రోజుల్లో మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది. ఇలా ఎక్కువగా తయారైన యూరిక్ యాసిడ్ ను మూత్రపిండాలు కొందరిలో బయటకు పంపలేకపోతుబటాయి. దీంతో ఈ యూరిక్ యాసిడ్ రక్తంలో పేరుకుపోయి కీళ్లనొప్పులు, కీళ్ల వాపులు, కీళ్లు ఎర్రగా మారడం, మూత్రపిండాల్లో రాళ్లు, వికారం, వాంతులు వంటి సమస్యలతోపాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కనుక మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎల్లప్పుడూ పరిమితి మించకుండా చూసుకోవడం చాలా అవసరం.
రోజూ మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చడం వల్ల ఎల్లప్పుడూ యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఆపిల్ మనకు ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ తో పాటు మాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది. అలాగే మనకు విరివిగా లభించే అరటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అరటి పండ్లల్లో అధికంగా ఉండే పొటాషియం కీళ్లల్లో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా చేయడంలో ఉపయోగపడుతుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారు చెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. చెర్రీ పండ్లల్లో ఆంథోసైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ ప్లమేషన్ ను అదుపులో ఉంచడంతో పాటు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా చేస్తాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలు కూడా ఎంతో దోహదపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంతో పాటు మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా ఉండే యారిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు పోతుంది.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో పైనాపిల్ కూడా ఎంతగానో దోహదపడుతుంది. దీనిలో ఉండే బ్రోమెలైన్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో, కీళ్ల నొప్పులను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయను తీసుకోవడం వల్ల కూడా మంచిఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు పోవడమే కాకుండా శరీరం కూడా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఇవే కాకుండా నీటిని ఎక్కువగా తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా పండ్లను రోజూ మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరంలో ఎల్లప్పుడూ యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.