Frequent Urination | మన శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు కిడ్నీలు ఎంతగానో శ్రమిస్తుంటాయి. రక్తాన్ని నిరంతరాయంగా వడబోస్తూ అందులో ఉండే వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అందుకనే నీళ్లను అధికంగా తాగాలని, మూత్ర విసర్జన క్రమం తప్పకుండా చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరికి పలు కారణాల వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో తరచూ మూత్ర విసర్జనకు నిద్ర లేవాల్సి వస్తుంది. ఇది నిద్రకు ఆటంకం కలగజేస్తుంది. దీంతో శరీరంపై ఒత్తిడి పడుతుంది. అయితే ఎవరిలో అయినా సరే మూత్ర విసర్జన అధికంగా అవుతుంది అంటే అందుకు పలు కారణాలు ఉంటాయి. వాటిని గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ (యూటీఐ) ఉన్నవారిలో తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. తరచూ మూత్ర విసర్జన చేయడంతోపాటు మూత్రం విసర్జించినప్పుడు మంట, నొప్పి కూడా ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే మూత్రాశయ ఇన్ఫెక్షన్ వచ్చిందని అనుమానించాలి. వెంటనే డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. దీంతో అతి మూత్ర విసర్జన తగ్గుతుంది. అలాగే కొందరికి మూత్రాశయం అతిగా స్పందిస్తుంటుంది. దీన్నే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. అంటే మూత్రాశయం పూర్తిగా నిండకపోయినా మూత్రం వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల తరచూ మూత్ర విసర్జన చేస్తారు. వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధిని కూడా నిర్దారించవచ్చు.
పురుషుల్లో వయస్సు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. ఇది మూత్రాశయంపై ఒత్తిడిని కలగజేస్తుంది. దీంతో తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే రాత్రి పూట మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు నిద్ర లేవాల్సి వస్తుంది. కనుక అతి మూత్ర వ్యాధి ఉందంటే షుగర్ ఉందేమో చెక్ చేయించుకోండి. ఒక వేళ మీకు షుగర్ లేకపోయినా మూత్రం అతిగా వస్తుంది అంటే ఇతర ఏమైనా కారణాలు అయి ఉంటాయని భావించాలి. అలాగే గర్భిణీలకు 3 నెల నుంచి గర్భాశయం పరిమాణం పెరిగే కొద్దీ మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి అతిగా మూత్రం వచ్చేలా చేస్తుంది. ఈ సమస్య ఉంటే డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా మందులను వాడాలి.
పెయిన్ఫుల్ బ్లాడర్ సిండ్రోమ్ అనే వ్యాధి బారిన పడిన వారిలోనూ అతి మూత్ర వ్యాధి వస్తుంది. కొన్ని రకాల మందులను వాడడం, ద్రవాహారం అతిగా తీసుకోవడం, కెఫీన్ లేదా మద్యం అతిగా సేవించడం, ఆందోళన, కంగారు ఉండడం, కిడ్నీ స్టోన్లు లేదా నాడీ సంబంధ వ్యాధులు ఉన్నా కూడా అతి మూత్ర వ్యాధి వస్తుంది. కనుక డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకుంటే అసలు సమస్య ఎక్కడ ఉందో గుర్తించవచ్చు. అందుకు అనుగుణంగా మందులను వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక ఈ సమస్యకు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు పలు ఇంటి చిట్కాలను పాటించినా కూడా ఉపయోగం ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాలు, క్రాన్ బెర్రీలు, ఉసిరికాయలు లేదా వాటి జ్యూస్, తులసి ఆకులు వంటి వాటిని తీసుకుంటుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.