Blood Platelets | చాలా ఏండ్ల క్రితం వరకు మనకు డెంగీ జ్వరం అంటే ఏంటో తెలియదు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా డెంగీ జ్వరాలు సర్వసాధారణం అయిపోయాయి. ఈ వ్యాధి వచ్చిన వారిలో ముఖ్యంగా రక్తంలో ప్లేట్లెట్ కణాలు తగ్గిపోయి ప్రాణాంతకంగా మారుతున్నది. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుంచి 4,50,000 వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. శరీరంలో వీటి జీవితకాలం 5-9 రోజులు. ముక్కు నుంచి రక్తం కారడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, గాయాలు, దెబ్బలు వంటి లక్షణాలతో పాటు మలంలో బ్లడ్ రావడం, యూరిన్ లో బ్లడ్ రావడం కూడా ప్లేట్ లెట్ కౌంట్ తక్కువగా ఉన్నట్లుగా చెప్తుంది. ఈ వ్యాధి కాంప్లికేట్ కాకముందే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. అయితే, కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తంలో ప్లేట్లెట్ కణాలను పెంచుకోవచ్చు. అవేవంటే..
విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలు
ఆరోగ్యకరమైన ప్లేట్లెట్ ఉత్పత్తికి విటమిన్ ఏ ఎంతో అవసరం. ఈ పోషకం శరీరంలో ప్రోటీన్ తయారవడానికి ముఖ్యమైనది. శరీరంలోని ఆరోగ్యకరమైన ప్రోటీన్ కంటెంట్ కణ విభజన, పెరుగుదల ప్రక్రియలో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాలలో క్యారెట్, గుమ్మడికాయ, కాలే, చిలగడదుంపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు
శరీరంలో ఫోలేట్ లోపం వల్ల రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. రక్తంలో ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడంతోపాటు కణ విభజనకు చాలా ముఖ్యమైన విటమిన్ బీ9 లేదా ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నారింజ రసం, బచ్చలికూర, తోటకూర, ఇతర ఆకుపచ్చ ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి.
విటమిన్ కే లోడ్ పెంచాలి
బ్లడ్ ప్లేట్లెట్లను పెంచే ఆహారాలలో విటమిన్ కే అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యమైనవి. శరీరంలో కణాల ఆరోగ్యకర పెరుగుదలకు ఈ పోషకం అవసరం. కాలే, గుడ్లు, ఆకు కూరలు, కాలేయం, మాంసం, క్యాబేజీ, పార్స్లీ తినడం వల్ల బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవచ్చు.
విటమిన్ బీ 12 ఆహారాలు
విటమిన్ బీ 12 రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని లోపం కారణంగా ప్లేట్లెట్ సంఖ్య తక్కువవుతుంది. గుడ్లు, పాలు, చీజ్‌లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. వీటిని నిత్యం తీసుకోవడం ద్వారా విటమిన్ బీ 12 అంది ప్లేట్లెట్స్ పెరుగుతాయి.
ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు
శరీరంలో ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తిని ఐరన్ ప్రోత్సహిస్తుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది ఉత్తమమైనది. ఆహారంలో గుమ్మడికాయ గింజలు, దానిమ్మ , కాయధాన్యాలు, ఆకు కూరలను చేర్చుకోవడం ద్వారా ఐరన్ శరీరానికి అందుతుంది.
విటమిన్ సీ దొరికే ఆహారాలు
విటమిన్ సీ ప్లేట్లెట్స్ సక్రమంగా పనిచేయడానికి సాయపడుతుంది. ఇది శరీరం ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది. రక్త ప్లేట్లెట్లను పెంచడానికి కూడా దోహదపడుతుంది. మామిడిపండ్లు, బ్రోకలీ, పైనాపిల్, టమాటలు, బెల్ పెప్పర్స్, కాలీఫ్లవర్, ఇండియన్ గూస్బెర్రీ లేదా ఉసిరికాయలను తినడం ద్వారా విటమిన్ సీ పొందవచ్చు.
గోధుమ గడ్డి కావాల్సిందే..
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యూనివర్సల్ ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, గోధుమ గడ్డి రక్తంలో ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది. కప్పు గోధుమ గడ్డితో చుక్క నిమ్మరసం కలిపి తాగడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయిని తేల్చారు.
వీటితో పాటు..
బొప్పాయిని నిత్యం తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి.
బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల కూడా వృద్ధి చెందుతాయి.
తినే ఫుడ్స్‌లో ఎక్కువగా వెల్లుల్లిని చేర్చుకోవాలి.
విటమిన్ కే పుష్కలంటా ఉండే ఆకుకూరలను తీసుకోవాలి.
రోజుకు రెండు ఆప్రికాట్స్ తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెరుగుతాయి.
సీఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవచ్చు.
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడి ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది.