Foods For Brain | మనం తీసుకునే ఆహారాలపైనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. మన మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మనం తీసుకునే ఆహారాలే కీలకపాత్ర పోషిస్తాయి. మన జ్ఞాపకశక్తిని కూడా ఇవి చాలా వరకు ప్రభావితం చేస్తాయి. మెదడుకు కావల్సిన పోషకాలు అందినప్పుడే మెదడు పనితీరు పెరుగుతుంది. మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నేటి తరుణంలో ఇటువంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచే మందులు, సప్లిమెంట్స్ మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. కనుక మనం తీసుకునే ఆహారాల ద్వారానే మెదడు పనితీరును మెరుగుపరిచే పోషకాలు అందేలా చూసుకోవాలి. మెదడు పనితీరును, జ్ఞాపక శక్తిని పెంచే పోషకాలు, ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడు పనితీరుకు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు మెగ్నిషియం చాలా అవసరం. మెగ్నిషియం ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నాణ్యమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. బీన్స్, చిక్కుళ్లు, బఠానీలు వంటి వాటిలో కూడా మెగ్నిషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇక బాదం, వాల్నట్స్, జీడిపప్పు, అవకాడోలు కూడా మెగ్నిషియంను కలిగి ఉంటాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి, మెదడుకు కావల్సిన మెగ్నిషియం అందుతుంది. దీంతో మెదడు ఆరోగ్యం, పనితీరు మెరుగుపడుతుంది.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మరొక ఖనిజం జింక్. జింక్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అల్జీమర్స్, చిత్తవైకల్యం, వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సాధారణ జలుబుతో బాధపడే వారు జింక్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల జలుబు తీవ్రత తగ్గడంతో పాటు జలుబు కూడా త్వరగా తగ్గుతుంది. గుమ్మడి గింజలు, రెడ్ మీట్, రొయ్యలు వంటి ఆహారాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
చక్కటి మెదడు ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. మెదడు సంబంధిత సమస్యలతో పాటు మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా ఈ కొవ్వు ఆమ్లాలు మనకు ఎంతో సహాయపడతాయి. చేపలు, వాల్నట్స్, సోయాబీన్స్, కనోలా నూనె, చియా గింజలు, సాల్మన్ చేపలు, అవిసె గింజలు వంటి ఆహారాల్లో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ ఆహారాలను ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరిగి చదివినవి బాగా గుర్తువుంటాయి.