Foods For Brain Activeness | మన శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు ఏ విధంగా అయితే అవసరం అవుతాయో మన మెదడుకు కూడా పోషకాలు అవసరం అవుతాయి. చాలా మంది మెదడు ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. కానీ మనం యాక్టివ్గా ఉండాలన్నా, చురుగ్గా పనిచేయాలన్నా, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలన్నా మెదడు ఆరోగ్యంగా ఉండడం తప్పనిసరి. అందుకు గాను మనం మెదడుకు అవసరం అయ్యే పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. ఇవి మెదడు కణాలకు బిల్డింగ్ బ్లాక్స్ మాదిరిగా పనిచేస్తాయి. జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం, ఇతర మెదడు క్రియలకు ఈ పోషకాలు అవసరం అవుతాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి మెదడు వాపులకు గురి కాకుండా రక్షిస్తాయి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు ఎక్కువగా చేపలు, సముద్రపు ఆహారం, బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, గుమ్మడి కాయ విత్తనాలు, అవిసె గింజలు, చియా సీడ్స్, అవకాడో వంటి వాటిల్లో లభిస్తాయి. వీటిని తింటుంటే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు సి, ఇలతోపాటు ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయడ్స్ కూడా అవసరమే. ఇవి మెదడు కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి విటమిన్లు బి9, బి6, బి12 ఎంతగానో దోహదం చేస్తాయి. ఇవి మెదడుకు కావల్సిన శక్తిని అందజేస్తాయి. న్యూరోట్రాన్స్మిటర్లకు కావల్సిన శక్తిని విడుదల చేస్తాయి. దీంతో మనం ఎల్లప్పుడూ హ్యాపీ మూడ్లో ఉంటాం. ఏ అంశంపైనైనా ఏకాగ్రత పెట్టగలుగుతాం. అలాగే జ్ఞాపకశక్తి సైతం పెరుగుతుంది.
మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు గాను కోలిన్ అనే పోషక పదార్థం కూడా ఎంతగానో అవసరం అవుతుంది. ఇది అసిటైల్ కోలిన్ అనే న్యూరోట్రాన్స్ మిటర్ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాదు, ఏ విషయాన్ని అయినా సరే సులభంగా నేర్చుకోగలుగుతారు. మెదడు కణాలను రక్షించడంలో, న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రించడంలో, నాడులను ఉత్తేజంగా చేయడంలో మెగ్నిషియం కూడా మనకు దోహదం చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచేందుకు, నేర్చుకునే శక్తిని పెంపొందించేందుకు సహాయం చేస్తుంది. జింక్, ఐరన్, సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు కూడా మన మెదడు ఆరోగ్యానికి అవసరమే. ఇవి మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు, అప్రమత్తత పెరిగేందుకు, చురుగ్గా ఉండేందుకు సహాయం చేస్తాయి.
ఇక మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో కనీసం 2 లేదా 3 సార్లు చేపలను తింటుండాలి. వీటితో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. అలాగే బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలను కూడా తినాలి. ఇవి మన మెదడుకు కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఫ్లేవనాయిడ్స్ అందేలా చేస్తాయి. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను తినడం వల్ల విటమిన్ కె, లుటీన్, ఫోలేట్, బీటా కెరోటిన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. వాల్ నట్స్, బాదంపప్పు, గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, చియా సీడ్స్ను తింటుంటే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, మెగ్నిషియం కూడా లభిస్తాయి. అదేవిధంగా ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా, వీట్ బ్రెడ్, పాస్తా, కోడిగుడ్లు, పసుపు, అవకాడో, డార్క్ చాకొలెట్లు, కాఫీ, గ్రీన్ టీ వంటి ఆహారాలను కూడా తీసుకుంటుండాలి. ఇవన్నీ మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి.