Foods At Night | మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో రోజూ మనం తినే ఆహారం ఎంతగానో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పౌష్టికాహారాన్ని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. జంక్ ఫుడ్ లేదా కొవ్వు పదార్థాలు, స్వీట్లు వంటి ఆహారాలను తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు సరైన ఆహారాన్నే తింటారు. కానీ ఒక పూట తినాల్సిన ఆహారాన్ని ఇంకో పూట తింటారు. లేదా ఒక సమయంలో తినాల్సిన ఆహారాన్ని మరో సమయంలో తింటారు. ఈ విధంగా ఆహారపు అలవాట్లు ఉంటే చేజేతులా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్న వాళ్లమవుతాం. కనుక ఏ సమయంలో ఏ ఆహారాన్ని తినాలో దాన్నే తినాల్సి ఉంటుంది. కొందరు రాత్రి పూట తినకూడని ఆహారాలను కూడా తింటుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కొన్ని ఆహారాలను రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదని ఆయుర్వేదం చెబుతోంది.
రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలనే తినాల్సి ఉంటుంది. మనకు రాత్రి పూట చాలా స్వల్ప మోతాదులో శక్తి అవసరం అవుతుంది. కనుక రాత్రి పూట అతిగా తినకూడదు. ఇక పిండి పదార్థాలు ఉండే ఆహారాలను వీలైనంత వరకు మధ్యాహ్నం పూటే ఎక్కువగా తినాలి. కానీ వీటిని రాత్రి పూట తినడం పూర్తిగా తగ్గించాలి. పిండి పదార్థాలు ఉండే ఆహారాలను రాత్రి పూట అధికంగా తింటే పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలో కొవ్వు చేరి అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక రాత్రి పూట పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తక్కువ మోతాదులో తినాల్సి ఉంటుంది. అన్నం, చపాతీలు ఈ కోవకు చెందుతాయి. కనుక రాత్రి పూట వీటిని తక్కువగా తింటే మంచిది.
రాత్రి పూట పెరుగు తినడం వల్ల శరీరంలో కఫం చేరుతుంది. ఇది దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను కలగజేస్తుంది. కనుక రాత్రి పూట పెరుగును తినకూడదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అలాగే ప్రోటీన్లు ఉండే ఆహారాలను కూడా రాత్రి పూట తక్కువగా తినాలి. చాలా మంది రాత్రి పూట మాంసం అధిక మొత్తంలో తింటారు. ఇది శరీరానికి చేటు చేస్తుంది. మాంసాన్ని కేవలం ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే అధికంగా తినాలి. రాత్రి పూట తింటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం కాదు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం ఏర్పడుతాయి. శరీరంలో కొవ్వు చేరుతుంది. కాబట్టి ప్రోటీన్లను రాత్రి పూట తినడం తగ్గించాలి. అలాగే కొవ్వు పదార్థాలను కూడా రాత్రి పూట తినకూడదు. ఆ సమయంలో వీటిని శరీరం జీర్ణం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అది మన శరీరంలో పేరుకుపోయి అధికంగా బరువు పెరుగుతాము. దీని వల్ల ఇంకా అనేక ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక రాత్రి పూట కొవ్వు పదార్థాలను తినకూడదు.
రాత్రి పూట ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు, విత్తనాలు వంటి ఆహారాలను తినవచ్చు. చిరు ధాన్యాలతో చేసిన ఆహారాలు అయితే మంచిది. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, కొర్రలు వంటి చిరు ధాన్యాలను రాత్రి పూట తింటే మేలు జరుగుతుంది. రాత్రి పూట కొవ్వు తీసిన గోరు వెచ్చని పాలలో కాస్త తేనె కలిపి తాగవచ్చు. అలాగే అల్లం రసం లేదా యాలకుల పొడిని అయినా కలిపి తాగవచ్చు. రాత్రి పూట ఆహారంలో దాల్చిన చెక్క పొడి, సోంపు గింజల పొడి, మెంతుల పొడి, యాలకుల పొడిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. రాత్రి పూట భోజనాన్ని 7.30 లేదా 8 గంటల లోపు ముగిస్తే మంచిది. దీంతో తిండికి, నిద్రకు మధ్య విరామం ఉంటుంది. నిద్ర చక్కగా పడుతుంది. శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. ఇలా ఆహారపు అలవాట్లను పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు.