Healthy Life Style | ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాలే చేస్తున్నారు. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసే ఉద్యోగాల్లో ఉండేవారు. మన పూర్వీకులు చేతి వృత్తులు, వృత్తి పనులు చేసేవారు. దీంతో వారికి రోజూ శారీరక శ్రమ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ చూసినా కంప్యూటర్లు వచ్చేశాయి. దీంతో మన పని చాలా తేలికైపోయింది. శారీరక శ్రమను మొత్తానికే తగ్గించేశారు. నూటికి 90 శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాలే చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు లేదా నైట్ షిఫ్ట్ అయితే రాత్రి నుంచి ఉదయం వరకు కూర్చుని గంటల తరబడి పనిచేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇలాంటి జీవన విధానం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. రోజూ శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలని అంటన్నారు. రోజుకు 8 గంటల కన్నా ఎక్కువగా కూర్చుని పనిచేసే వారికి భవిష్యత్తులో పలు అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
రోజుకు 8 గంటలకన్నా ఎక్కువగా కూర్చుని పనిచేస్తే మన వెన్నెముక ఆకారం మారుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల వెన్నెముక కండరాలు బలహీనంగా మారిపోతాయి. అలాగే పొట్ట, ఛాతి దగ్గర ఉండే కండరాల పటుత్వం తగ్గిపోతుంది. ఆయా భాగాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగక వెన్నెముక ఆకారం పోతుంది. దీంతో వెన్ను నొప్పి మొదలవుతుంది. అలాగే చూపులో కూడా తేడా వస్తుంది. దృష్టి తగ్గుతుంది. తలనొప్పి సమస్య అధికంగా వస్తుంటుంది. రోజూ శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి కూర్చుని పనిచేసేవారికి కొన్ని సంవత్సరాలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాంటి వారికి ముందుగా బీపీ వస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. ఏదో ఒక సమయంలో గుండె పోటు వస్తుంది. ఫలితంగా ప్రాణాంతకం అవుతుంది. కనుక రోజూ శారీరక శ్రమ ఉండాలని అంటున్నారు.
గంటల తరబడి కూర్చుని పనిచేసేవారిలో కాళ్లలో రక్త నాళాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగక ఆయా భాగాల్లో రక్తం గడ్డ కడుతుంది. దీంతో వెరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. అలాగే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు అధికంగా బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వు చేరుతుంది. కండరాలు, ఎముకలు సైతం బలహీనంగా మారుతాయి. తీవ్రమైన నొప్పులు వస్తాయి. ఆయా భాగాలను కదిలించాలంటేనే నొప్పిగా ఉంటుంది. గంటల తరబడి కూర్చుని పనిచేయడం జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాదు. దీంతో అజీర్తి ఏర్పడుతుంది. ఇది మలబద్దకానికి దారి తీస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది కనుక నిద్రపై ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగ్గా పోలేకపోతుంటారు. డిప్రెషన్, ఆందోళన బారిన పడతారు.
ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటు ఏదైనా తేలికపాటి వ్యాయామం అయినా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పనిచేసే సమయంలో వీలైనంత వరకు లేచి తిరిగే ప్రయత్నం చేయాలి. మధ్య మధ్యలో కాసేపు విరామం తీసుకోవాలి. ఆఫీసుల్లో లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించండి. సొంత వాహనాలు కాకుండా వీలున్నంత వరకు ప్రజారవాణాకు ప్రాధాన్యం ఇవ్వండి. మధ్యాహ్నం భోజనం చేయగానే సీట్లో కూర్చుని పనిచేయకుండా కాసేపు నిలబడి ఉండండి. ఆఫీసుల్లో మీటింగ్స్ పెడితే నిలబడి ఉండండి. రాత్రి పూట వీలైనంత త్వరగా నిద్రించేందుకు ప్రయత్నించండి. ఈ సూచనలు పాటిస్తే భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.