Belly Fat | పొట్ట దగ్గరి కొవ్వు అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా మంది సన్నగానే ఉంటారు. కానీ పొట్ట దగ్గర కొవ్వు మాత్రం అధికంగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. జన్యువుల ప్రభావం, థైరాయిడ్ సమస్య ఉండడం, ఒకే దగ్గర ఎక్కువ సమయం పాటు కూర్చుని చేయకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, జంక్ ఫుడ్ ను అధికంగా తినడం, మాంసాహారాన్ని అధికంగా తినడం, మద్యం అధికంగా సేవించడం వంటి పలు కారణాల వల్ల చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. దీన్ని తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తూ ఆహారంలో మార్పులు చేసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వును చాలా సులభంగా కరిగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటుంటే కొవ్వు సులభంగా కరిగిపోతుంది. ఫైబర్ వల్ల ఆహారాన్ని తక్కువగా తింటారు. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా లోపలికి చేరుతుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఆకుకూరలు, తాజా పండ్లు, నట్స్, విత్తనాలు, పప్పు దినుసులు వంటి వాటిల్లో లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. రోజుకు 2 కప్పుల గ్రీన్ టీని చక్కెర లేకుండా తాగాలి. తేనె కూడా అందులో కలపకూడదు. గ్రీన్ టీలో ఈజీసీజీ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చయ్యేలా చేస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గ్రీన్ టీని రోజుకు 2 కప్పులకు మించి తాగకూడదు.
బాదంపప్పులు, వాల్ నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. అందువల్ల ఆయా గింజలు లేదా విత్తనాలను రోజూ నీటిలో నానబెట్టి తింటుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధికంగా ఆహారం తినకుండా చూసుకోవచ్చు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఓట్స్‌ను రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే ఫైబర్ వల్ల పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుంది. అలాగే యాపిల్ పండ్లను కూడా రోజూ తినాలి. మొలకలు, క్యారెట్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా బరువును తగ్గిచుకోవచ్చు. నడుము సన్నగా నాజూగ్గా తయారవుతుంది.
మీరు రోజూ తినే తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్‌ను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఫైబర్‌ను అందిస్తుంది. దీని వల్ల కాస్త తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అలాగే పసుపు నీళ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తాగుతున్నా కూడా ఫలితం ఉంటుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. భోజనానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసాన్ని సేవిస్తుండాలి. మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. మిరియాల పొడిని తేనెతో కలిపి రోజుకు 2 పూటలా తింటున్నా ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడంతోపాటు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడి వల్ల కూడా ఆహారం అధికంగా తింటారు. ఇది బరువు పెంచేలా చేస్తుంది. కనుక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అలాగే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తుండాలి. దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.